ఎన్నారైలతో పవన్ కాన్ఫరెన్స్
యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారాజ్యం అభిమానులను ఉద్దేశించి తొలిసారిగా మెగా కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుబోతున్నారు. ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఈ వినూత్నమైన ప్రక్రియను నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక రాజకీయ పార్టీ తరఫున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే ప్రధమం. ఏడు కాన్ఫరెన్స్ కాల్ బ్రిడ్జిల ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలోగల ప్రజారాజ్యం అభిమానులను అనుసంధానం చేస్తుంది ఈ మెగా కాన్ఫరెన్స్ కాల్.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నివసిస్తున్న తెలుగువారిలో అనేక మంది ప్రజారాజ్యం పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి మానాప్రగడ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారాజ్యంను బలపరుస్తున్న ప్రవాసీ తెలుగువారందరినీ సంఘటితపరిచేందుకు తాము నడుం బిగించామని, అందులో భాగంగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో ఈ మెగా టెలీకాన్ఫరెన్స్ కాల్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఖండాంతరాలకు విస్తరించిన తెలుగు ప్రజలందరి మధ్య వారధిని నిర్మించి వారందరినీ జన్మభూమికి అనుసంధానం చేయడం ద్వారా సత్ఫలితాలు రాబట్టవచ్చునన్న ఆలోచనతోనే ఈ మెగా కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఏడు బ్రిడ్డిలు కలిగిన ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ఒకో బ్రిడ్జిపై 150 మంది ఎన్నారైలు కనక్టై కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు. ఏడు బ్రిడ్జిలకు మోడరేటర్లుగా వెంకట్ మోరోజు, నరసయ్య వడ్రాణం, శేఖర్ సీరా, రజనీకాంత్, రామ్ తోట, శివ వెజ్జు, రజనీ ఆకుర్తి వ్యవహరిస్తారు. శ్రీనివాస్ మానాప్రగడ సూపర్ మోడరేటర్ గా వ్యవహరిస్తూ పవన్ కల్యాణ్ తో మొదటిగా కాంటాక్ట్ నెలకొల్పుతారు.
ఈ మెగా కాన్ఫరెన్స్ కాల్ కార్యక్రమం ఏర్పాటులో యువరాజ్యం ఉపాధ్యక్షుడు శ్రావణ్, పెదపల్లి లోక్ సభకు ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎన్నారై అభ్యర్ధి బుచ్చన్న గాజుల ఇతర ప్రజారాజ్యం ముఖ్యులు ఎంతగానో సహకరించినట్లు శ్రీనివాస్ తెలిపారు. మెగా కాన్ఫరెన్స్ కాల్ లో అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, మలేషియా, జర్మనీ, మస్కట్, దుబాయ్ దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు ప్రధానంగా పాల్గొంటున్నంట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ తో మెగా కాన్ఫరెన్స్ కాల్ పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నది.
News Posted: 20 March, 2009
|