ఐటీ సిబ్బందికి సిటిఏ శిక్షణ
షికాగో : అమెరికాలోని ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు విధి నిర్వహణ పరంగా మరింత మెరుగైన పనితనం చూపించేందుకు పలు అంశాల్లో ఉచితంగా శిక్షణ సౌకర్యం కల్పించేందుకు షికాగో తెలుగు అసోసియేషన్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తొలి శిక్షణ కార్యక్రమంగా అరోరాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సంయుక్త ఆధ్వర్యంలో 'క్యు.ఎ., టెస్టింగ్ ట్రైనింగ్'లో ఒక రోజు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసినట్లు రావు ఆచంట ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అందరి గుండెలను అదరగొడుతున్న ఆర్థిక మాంద్య పరిస్థితులను ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే ధైర్యాన్ని కల్పించడం షికాగో తెలుగు అసోసియేషన్ ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో 70 మందికి పైగా అభ్యర్థులు పాల్గొని ఐటీ రంగంలో సరికొత్త అంశాలపై అవగాహన కల్పించుకున్నారు.
ఉద్యోగాలు లేక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారికి స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు ఒక్కటై ఎలా చేయూతనివ్వాలన్నది షికాగో తెలుగు అసోసియేషన్ ఈ శిక్షణ శిబిరాల నిర్వహణ ద్వారా చక్కని మార్గాన్ని వేసి చూపినట్లైంది. తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి వీలు కలిగించే విధంగా ఇంత మంచి శిక్షణ ఇచ్చినందుకు శిక్షణలో పాల్గొన్న వారంతా షికాగో తెలుగు అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని తెలుగువారి ప్రతిభకు మరింత మెరుగు పెట్టేందుకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాలతో పాటు ఉద్యోగ నియామకాలు, నిపుణుల నుంచి అంశాలకు సంబంధించిన నైపుణ్యాంశాలను (సబ్జెక్ట్ మేటర్ ఎక్స్ పర్ట్ - ఎస్.ఎం.ఇ.), కోరుకున్న వారికి కన్సల్టింగ్ వ్యవహారాలను వెబ్ సైట్ లో పొందుపరచి మరింతగా చేయూతనివ్వాలని షికాగో తెలుగు అసోసియేషన్ సంకల్పించినట్లు రావు ఆచంట తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చెరుకు నరేష్ కు షికాగో తెలుగు అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.
ఈ శిక్షణ శిబిరానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవగాహనా శిక్షణ కార్యక్రమ నిర్వహణకు తొలిసారిగా పలు నాన్ ప్రాఫిట్ సంస్థలు కూడా తమ సహాయ సహకారాలు అందించాయని రావు ఆచంట తెలిపారు. ఈ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహణకు సి.టి.ఎ. బృందంలో రావు ఆచంట, ప్రసాద్ తళ్ళూరి, ప్రవీణ్ మోటూరు, రమేష్ మర్యాల, చుండు శ్రీనివాస్, ప్రవీణ్ భూమన, వేణు కొండూరు, కృష్ణ అడుసుమల్లి, ఆలయ వలంటీర్ వర్దీష్ తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు.
News Posted: 24 March, 2009
|