గుండెపోటుతో ఇంజనీర్ మృతి
న్యూజెర్సీ : చిత్తూరు జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ళ యువ ఇంజనీర్ ఉదయ్ తోట తీవ్ర గుండెపోటుతో న్యూజెర్సీలో అసువులు బాసారు. మార్చి 23 సోమవారం రాత్రి 7.30 గంటలకు తీవ్రంగా వచ్చిన గుండెపోటుతో ఉదయ్ అకస్మాత్తుగా మరణించారు. న్యూజెర్సీలోని ఫిజర్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉదయ్ కు భార్య, టీచర్లుగా రిటైరైన తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు.
చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఉదయ్ విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల నుంచి 1997లో బిటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందారు. అనంతరం భారతదేశంలో విప్రో సంస్థలో ఉద్యోగం చేశారు. 2002లో ఆయన అమెరికా వచ్చారు. గ్రీన్ కార్డు హోదా ఉన్న ఉదయ్ ఎనిమిది నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. ఉదయ్ మరణించే సమయానికి ఆయన భార్య దగ్గర లేరు. సెలవు మీద ఆమె కొద్దిరోజుల క్రితమే భారతదేశం వెళ్లారు.
ఆంధ్రరాష్ట్రానికి చెందిన యువ ఇంజనీర్ ఉదయ్ ఆకస్మిక మృతికి తానా కార్యదర్శి ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో ప్రవాసాంధ్రుల మరణ వార్తలు వినడం తమను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయాన్ని తాను సంప్రతించానని, ఉదయ్ మృతదేహాన్ని వీలైనంత తొందరగా భారతదేశం పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లను తానా సంస్థ తరఫున చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఉదయ్ కుటుంబసభ్యులకు తానా తరఫున ప్రసాద్ తోటకూర ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఉదయ్ తోట ఆత్మకు శాంతి కలగాలని ఆయన నివాళులు అర్పించారు.
News Posted: 26 March, 2009
|