న్యూజెర్సీ : హైదరాబాద్ కు చెందిన 28 ఏళ్ల విద్యార్థి రాజీవ్ రెడ్డి మల్లాది న్యూయార్క్ లోని సన్నీసైడ్ ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదంలో అసువులు బాసాడు. న్యూయార్క్ ఐటి నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్ డిగ్రీ పూర్తి చేసిన రాజీవ్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తానా కార్యదర్శి ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. న్యూయార్క్ లోని సన్నీసైడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజీవ్ రెడ్డి మార్చి 23 ఉదయం 9.30కు తాను ఉంటున్న ప్రాంతంలోనే జరిగిన రైలు ప్రమాదంలో మరణించాడని ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. రాజీవ్ రెడ్డికి వృద్ధులైన తాతయ్య నానమ్మ ఉన్నారు. మనవడి మరణ వార్త విన్న వెంటనే వారు తీవ్ర దిగ్భ్రమతో కుంగిపోయారని ప్రసాద్ తోటకూర తెలిపారు.
అత్యంత ప్రతిభావంతుడైన రాజీవ్ రెడ్డి హైదరాబాద్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల నుంచి 2003లో బిటెక్ డిగ్రీ పూర్తి చేశాడు. స్టుడెంట్ వీసా (ఎఫ్ 1) మీద 2006లో అమెరికా వచ్చిన రాజీవ్ రెడ్డి న్యూయార్క్ ఐటి నుంచి 2008 జూలైలో ఎం.ఎస్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
రాజీవ్ రెడ్డి పార్దివ శరీరానికి న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ సిటీలో ఉన్న ఎడ్వర్డ్ డి లించ్ శ్మశానవాటికలో మార్చి 24 మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రసాద్ తోటకూర వెల్లడించారు. రాజీవ్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఖర్చులను తానా సంస్థ భరించిందని ఆయన తెలిపారు. రాజీవ్ రెడ్డి లాంటి యువ విద్యావేత్త ఆకస్మికంగా మరణించడం పట్ల తానా ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. రాజీవ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రసాద్ తోటకూర సానుభూతిని వ్యక్తం చేశారు.