నందమూరి యువ సింహం
మిచిగాన్ : తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న నందమూరి యువసింహం, జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్నారై టిడిపి విభాగం ప్రశంసలతో ముంచెత్తింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం తీరును చూసి పరవశించిన ఎన్నారై టిడిపి మీడియా ఇన్ చార్జి బసవేంద్ర వి సూరపనేని ఆయనకు ఒక లేఖను మీడియా ద్వారా పంపించారు. లేఖలోని అంశం యథా తధంగా ;
'అడుగిడిన ప్రతి రంగాన్ని చెడుగుడు ఆడిన మా నందమూరి యువ సింహమా!
రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన తరుణంలో మన తెలుగుదేశం పార్టీ మీ భుజస్కంధాలపైన పెట్టిన బృహత్తర బాధ్యతని అవలీలగా నిర్వహిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో ఆందోళననీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల స్థైర్యాన్నీ ఏకకాలంలో పెంచుచూ, మండుటెండల్లో లక్షలాది ప్రజలతో మమేకమైన జన హృదయ విజేతకి జరిగిన ప్రమాదం దుస్సంఘటన మా గుండెలను బాధతో దహించివేస్తున్నది. శ్రీకాకుళంలో సుడిగాలిలా ప్రారంభం అయిన మీ ప్రచారం వాడవాడలా, పల్లెపల్లెలా అశేష జనవాహినిని కుల, మత, ప్రాంత రహితంగా కదలించింది. మీ ఆవేశం, ప్రత్యర్థులకు రాబోయే ఎన్నికలలో జరగబోయే పరాజయాన్ని చూపి, పేదవాడి గుండెల్లో తెలుగుదేశం పైన మమకారాన్ని పెంచింది. జరుగుతున్న అవినీతిపై మీ ఆవేదనలో పేదవాడి గుండె చప్పుడు వినిపించింది. రాక్షస పాలన పైన మీ కోపంలో పేదవాడి ఆక్రోశం కనబడింది. తెలుగువాడికి ఢిల్లీ వీధుల్లో వరుసగా జరుగుతున్న అవమానాలపైన మీ సూటి ప్రశ్నలతో ఒక జాతి జాగృతం అయ్యింది. యోధుడంటే ఎలా ఉంటాడో, అతని పోరాట స్ఫూర్తి ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు తిరిగి మరోసారి మీ రూపంలో తెలిసింది.
ఈ కష్ట సమయంలో మీకు ఒక్కటే చెప్పదలచుకున్నాం!! మీ క్షేమం కోసం కొన్ని కోట్ల హృదయాలు అహర్నిశలూ తల్లడిల్లుతున్నాయి. ఆ భగవంతుడిని మీ కోసం ప్రార్థిస్తున్నాయి.
మీరు సంపూర్ణ ఆరోగ్యంతో సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ'
మీ ఎన్నారై టిడిపి మిచిగాన్ సభ్యులు, అభిమానులు.
News Posted: 31 March, 2009
|