ఐఏఎఫ్ సి పుస్తకాల పంపిణీ
డల్లాస్ : చిన్నారుల్లో గ్రంథ పఠనం పట్ల ఆసక్తి కలిగించాలన్న లక్ష్యంతో వెయ్యి పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ (ఐఏఎఫ్ సి) ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తోటకూర హామీ ఇచ్చారు. డల్లాస్ నగరంలోని తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన చిన్నారులకు ఈ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31న డల్లాస్ లో జరిగిన ఐఏఎఫ్ సి ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.
ప్రీ కె నుండి సిక్స్త్ స్టాండర్డ్ వరకూ ఉపయోగపడే పుస్తకాలను ఏప్రిల్ 17, 18 తేదీల్లో డల్లాస్ లో జరిగే 'చిల్డ్రన్స్ బుక్ ఫెయిర్ అండ్ లిటరరీ ఫెస్టివల్'లో అందజేస్తారు. జాతీయ స్థాయిలో సుప్రసిద్ధులైన పది మందికి పైగా రచయితలు, చిత్రకారులు ఈ బుక్ ఫెయిర్ కార్యక్రమానికి హాజరవుతున్నారని ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చిన్నారులకు ఓ చక్కని సదవకాశం అని ఆయన పేర్కొన్నారు. ఐఏఎఫ్ సి తరఫున ఆ సంస్థ బోర్డ్ డైరెక్టర్ రావు కల్వల ఈ ప్రాజెక్ట్ కు నాయకత్వం వహిస్తారు. ఈ సంవత్సరం నిర్వహించే పుస్తక ప్రదర్శనను 'ఓపెనింగ్ మైండ్స్ బై ఓపెనింగ్ బుక్స్' అనే శీర్షిక కింద నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
'ఇలాంటి బహుళ ప్రయోజన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. చిన్న వయస్సులోనే పిల్లల్లో పఠనం పట్ల ఆసక్తి కలిగించడం ఈ నవీన కాలంలో చాలా ముఖ్యం. ఈ పుస్తక వితరణ కార్యక్రమం ద్వారా డల్లాస్ లోని తక్కువ ఆదాయ పరిధిలో ఉన్న వేలాది కుటుంబాల పిల్లలు లబ్ధి పొందుతారు' అని ప్రసాద్ తోటకూర వివరించారు.
డల్లాస్ మేయర్ సతీమణి లారా లెపెర్ట్, డల్లాస్ చిల్డ్రన్ బుక్ ఫెయిర్ గౌరవ అధ్యక్షుడు లాల్ దాస్వాని, గ్రేటర్ డల్లాస్ ఆసియన్ అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రెనె డూతియా, ఐఏఎఫ్ సి బోర్డ్ డైరెక్టర్ ఊర్మిళ్ షా, ఎంఈఈడి సెంటర్ ప్రెసిడెంట్ గాల్ జుమోస్, ఇంకా పలువురు ప్రముఖులు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటారని ప్రసాద్ తోటకూర తన ప్రకటనలో స్పష్టం చేశారు.
News Posted: 2 April, 2009
|