శ్రీధర్ రెడ్డికి తేన ప్రశంస
మిషిగన్ : తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎప్పడిస్తారంటూ ముఖ్యమంత్రిని ధైర్యంగా ప్రశ్నించి నిలదీసిన శ్రీధర్ రెడ్డిని తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తేన) ప్రశంసించింది. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి కొట్టడాన్ని, పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తేన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తేన అధ్యక్షుడు రవి మేరెడ్డి కన్వీనర్ హరి మారోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి తీరుగానే ప్రతి తెలంగాణ వాది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం నినదించి, రాజకీయ నాయకులను నిలదీయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు పిలుపునిచ్చారు. శ్రీధర్ రెడ్డిపై దాడిని, కేసు నమోదు చేయడాన్ని ప్రతి తెలంగాణ వాది ఖండించాలని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులు పౌరుల ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్ర్యాన్ని తుంగలో తొక్కుతున్నారని వారు విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం కుతకుతలాడుతున్న తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా ముఖ్యమంత్రిని నిలదీసిన శ్రీధర్ రెడ్డి ధైర్యసాహసాలను తేన ప్రశంసించింది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా చర్యలు చేపట్టడంలో దారుణంగా విఫలమైన ప్రభుత్వాన్ని ప్రతి తెలంగాణ వాదీ నిలదీయడానికి ఇదే సరైన అదను అని రవి మేరెడ్డి, శ్రీధర్ మారోజు పేర్కొన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం గ్రామాలకు వస్తున్న రాజకీయ నాయకులను శ్రీధర్ రెడ్డి మాదిరిగానే తెలంగాణ యువకులు నిలదీయాలని తెలిపారు. తెలంగాణ ద్రోహి వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించే సభలు, సమావేశాలను బహిష్కరించాలని, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు.
News Posted: 3 April, 2009
|