పిఆర్పీ ఎన్నారై వింగ్
హైదరాబాద్ : ప్రజారాజ్యం అనుబంధ విభాగం 'ఎన్నారై వరల్డ్ వైడ్ వింగ్'ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని యువరాజ్యం ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి. శ్రవణ్ కుమార్ ఏప్రిల్ ఒకటిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎన్నారై వరల్డ్ వింగ్ అధ్యక్షునిగా పి. వెంకట్ సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా రఘువీర్ బండి, ప్రజా సంబంధాల సెల్ కన్వీనర్ గా మూర్తి కొమిరెడ్డి, కరణం వెంకట్ కో ఆర్డినేటర్ గా నియమించినట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా వెంకట్ సంజీవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సమాజంలో మార్పును తీసుకువచ్చేందుకు, సామాజిక న్యాయాన్ని సాధించాలన్న లక్ష్యంతో రాజకీయ రంగంలో అడుగిడిన మెగాస్టార్ చిరంజీవికి ప్రవాసాంధ్రులందరూ చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అఖండ విజయం సాధించేందుకు అందరూ తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రుల పురిటిగడ్డ ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేందుకు ప్రతి ఎన్నారై చిరంజీవితో కలిసి నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సంజీవ్ అభిప్రాయపడ్డారు.
News Posted: 3 April, 2009
|