యూటా ఆవిర్భావం
న్యూజెర్సీ: తానా, ఆటాలతో పాటు అమెరికాలో మరో తెలుగు సంఘం వెలసింది. అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రజలను ఐక్యం చేసేందుకు చురుకైన, పారదర్శకమైన సంఘాన్ని నిర్మించాలన్న స్వప్నంతో, దృష్టితో యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోషియేషన్ (యూటా)ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ కర్యనిర్వాహక వర్గం ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న పలువురు తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల నుండి ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పాటుకు సహకరించిన తెలుగు ప్రజలందరికి కార్యనిర్వాహక వర్గం ధన్యవాదాలు తెలియజేస్తోంది.
పలు తెలుగు సంఘాలు ఉండగా కొత్తగా మరో సంఘం ఏర్పడడానికి కారణాన్ని వివరిస్తూ-చురుకైన, పారదర్శకమైన సంఘాన్ని నిర్మించడమే ఏకైక లక్ష్యంగా యూటా సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆ కార్యనిర్వాహక వర్గం తెలిపింది. ఈ నూతన సంఘం ఇప్పటికే ఉనికిలోని సంఘాల్లో సాంప్రదాయకంగా వస్తున్న ధోరణులను వదలిపెట్టి, రాజకీయ, పక్షపాత వైఖరులకు అతీతంగా నిక్కచ్చిగా పిల్లలకు, యువతకు సహాయం చేస్తుంది. నూతన తరాలకు వారి జాతి మూలాలను అర్ధం చేయించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు రాబోయే కొద్ది వారాల్లో యూటా ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహక వర్గం తెలిపింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలను సమీకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా యూటా సంఘంలో జీవితకాల సభ్యత్వం తీసుకోవలసిందిగా అమెరికా తెలుగు ప్రజలను కారుతున్నాము. అదే విధంగా మీరు జీవితకాల సభ్యత్వం తీసుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను ఈ సంఘంలో చేరేందుకు ప్రోత్సహించాలని కోరుతున్నట్లు కార్యనిర్వాహక వర్గం తెలిపింది. హైస్కూల్ పూర్తి చేసిన విద్యార్దులు ఈ సంస్థ విద్యార్థి సభ్యులుగాను, యువజన సభ్యులుగాను చేరవచ్చు.
సంఘానికి సంబంధించిన కార్యక్రమాలు, నిబంధనలు, నియమావళి, మరి ఇతర వివరాలు తెలుసుకోరే వారు www.utaaworld.org వెబ్ సైట్ ను సందర్శించమని వారు కోరారు. సభ్యత్వ నమోదు ఫారాలు, నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలు రిజిస్టర్ సెక్షన్ లో వివరించడం జరిగింది. మీ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను contact@utaaworld.org ద్వారా సంప్రదించవలసి ఉంటుంది.
News Posted: 9 April, 2009
|