ముణెమ్మకు ఎన్నారైల మద్దతు
వాషింగ్టన్ : నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న తుపాకుల ముణెమ్మకు ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించారు. వీరంతా ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా పనిచేస్తున్న ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ కు చెందిన వారు. అత్యంత పేదరికంలో మగ్గుతున్న ఆమెకు నైతిక మద్దతు ఇచ్చేందుకు వారంతా ముందుకు వచ్చారని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో తెలిపారు.
వంద మందికి పైగా ప్రవాసాంధ్రులు అత్యంత ఉత్కంఠ, ఉత్సాహంతో విజయవంతంగా నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో తుపాకుల ముణెమ్మకు తమ నైతిక మద్దతు ప్రకటించారు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినాయకుడు ఎంపిక చేసిన తుపాకుల ముణెమ్మ ఈ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం ఆవశ్యకతను ఆమె ప్రస్తావించారు. అత్యధిక మెజారిటీతో తాను ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తానన్న ధీమాను ముణెమ్మ వ్యక్తం చేశారు. 'చిరంజీవి అన్నయ్య'ను చిరంజీవిని చేస్తానంటూ ఈ సందర్భంగా ముణెమ్మ శపథం చేశారు.
అత్యంత పేదరాలైన తనకు అన్ని విధాలా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ కు చెందిన ప్రవాసాంధ్రులకు ముణెమ్మ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి వచ్చి వారి వారి కుటుంబ సభ్యులు, మిత్రుల ఓట్లను తనకు, ప్రజారాజ్యం పార్టీకి వేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముణెమ్మ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రవాసాంధ్రులు ఆమె చెప్పినట్లే చేస్తామంటూ హామీ ఇచ్చారు. అత్యధిక మెజారిటీతో ముణెమ్మ విజయం సాధించాలని ప్రవాసాంధ్రులు ఆకాంక్షించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ కాల్ ను యువరాజ్యం వరల్డ్ కు చెందిన కోర్ కమిటీ సభ్యులు శివ వెజ్జు, కుమార్ కొత్తపల్లి, సత్యనారాయణ వెజ్జు, దాము తదితర ఎన్నారైలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ పలివెల, శ్రీనివాస్ చిమట, రవి సింహాద్రిలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ టెలికాల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నారైలందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
News Posted: 20 April, 2009
|