హేతువాదంపై వాడిగా చర్చ
డల్లాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థ తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 21 వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం స్థానిక పసంద్ ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ రచయిత, జర్నలిస్ట్, మానవతావాది డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య ముఖ్య అతిధిగా విచ్చేశారు.
మొదట మురళీధర్ టెక్కలకోట స్వీయ కవితలు చదివి వినిపించారు. తరువాత రమణ జువ్వాది సిరివెన్నెల రాసిన ఉగాది కవితాగానం చేశారు. తదుపరి డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి చందోబద్ధంగా రాసిన ఉగాది పద్యాలను చదివి వినిపించారు. తదుపరి చంద్ర కన్నెగంటి తెలుగు భాషలోని కొన్ని ప్రత్యేక పదాలను విశదీకరించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు ముఖ్య అతిధి డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్యను సభకు పరిచయం చేశారు.
'తెలుగు ప్రజల పునర్వికాసం - నేటి ఆవశ్యకత' అనే అంశంపై ముందుగా ఇన్నయ్య ప్రసంగించారు. అనంతరం మూఢ విశ్వాసాలు, మత ఛాందసవాదం మానవ సమాజానికి, మానవత్వానికి కలుగజేసె హాని గురించి వివరించి, హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవలసిన అవసరాన్ని వివరించారు. పిమ్మట హేతువాదం మీద వాడిగా వేడిగా సాగిన చర్చలో, సభికుల ప్రశ్నలకు సమాధానాలు తెలియచేశారు.
ముఖ్య అతిధిని బిఓటి చైర్ రాం యలమంచిలి, సత్యం కల్యాణదుర్గ శాలువతో సత్కరించారు. టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి పుష్ప గుచ్ఛంతో, సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. రావు కల్వల వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
News Posted: 21 April, 2009
|