'పని చూసుకో ఎన్టీఆర్'
వాషింగ్టన్ : తెలుగుదేశం పార్టీ గురించి జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలన్నీ అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ చెప్పిన మాటలు వింటుంటే మహాకూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ వ్యభిచారం చేస్తోందా అన్న అపోహ తలెత్తుతోందన్నారు. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు, లేవనెత్తిన ఆరోపణలు ఆయనను, తెలుగుదేశం పార్టీకి ఎక్కడా చోటు లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నపిల్లవాడని, తన నట జీవితంపై దృష్టి సారించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన సమయంలో ఇలా రాజకీయ రొంపిలో కూరుకుపోవడం, అందులోను రాజకీయ కౌటిల్యుడు లాంటి చంద్రబాబు కబంధ హస్తాల్లో ఇరుక్కుపోవడం మంచిది కాదన్నారు. పచ్చి అవకాశ వాది అయిన చంద్రబాబునాయుడు తన స్వార్థప్రయోజనాల కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని, జూనియర్ ఎన్టీఆర్ ను అవసరానికి వాడుకుంటున్నారని శ్రీనివాస మానాప్రగడ ఆందోళన వ్యక్తం చేశారు. అవసరం తీరాక వదిలేసే చంద్రబాబును ఎన్టీఆర్ ఎలా నమ్మారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని తనను తాను విశ్లేషించుకోవాలని, తన కుటుంబం గురించి ఆలోచించాలని శ్రీనివాస మానాప్రగడ సలహా ఇచ్చారు. అసలు తన కుటుంబానికి ఎంత రేషన్, సరకులు అవసరం అవుతాయో ఎన్టీఆర్ కు తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇతరుల మీద ఆరోపణలు చేసే ముందు మీ తాత ఎన్టీఆర్ ను ఎవరు హతమార్చారో మీకు తెలుసా అని జూనియర్ ను శ్రీనివాస ప్రశ్నించారు.
మామ చంద్రబాబు నాయుడి భవిష్యత్ కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా సినిమా కెరీర్ పై దృష్టి సారించాలని శ్రీనివాస సలహా ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు నిజంగా మీకు మామేనా అన్న విషయం తెలుసుకోవాలన్నారు. అలా అని చంద్రబాబు నాయుడిని ముందు అంగీకరించేలా చూసుకోమని చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన ఎన్టీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని, మంచం మీద ఉండడం వల్ల ఆయన వత్తిడికి గురవుతున్నారని శ్రీనివాస పేర్కొన్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని, తాము, ప్రజారాజ్యం పార్టీ కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ మీద గాని, ఆ పార్టీ నాయకుల మీద గాని సోమవారంనాడు ఎన్టీఆర్ చేసిన మాదిరి వ్యాఖ్యలు ఇకపై చేస్తే ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. హద్దులు మీరితే భవిష్యత్ లో ప్రజారాజ్యం పార్టీ అందజేసే నెలవారీ రేషన్ మీద ఆధారపడి బతకాల్సి వస్తుందని శ్రీనివాస మానాప్రగడ హెచ్చరించారు.
News Posted: 21 April, 2009
|