యుఎస్ లో వాసవీ జయంతి
అట్లాంటా : అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు, వాసవీయులు కన్యకా పరమేశ్వరి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించుకుంటున్నారని విజయ్ చవ్వ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 50 రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఉన్న ప్రవాస భారతీయులు రెండు వారాలపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఎన్నారై వాసవీ అసోసియేషన్, స్థానిక వాసవీ సంస్థలు మే 3నుంచి 17 వరకూ అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నట్లు పెనుగొండ వాసవీ ట్రస్ట్ అధ్యక్షుడు ఆనంద్ గార్లపాటి ఒక ప్రటనలో తెలిపారు.
గత సంవత్సరం అమెరికాలో నిర్వహించిన వాసవీ జయంత్యుత్సవాల్లో ఐదు వేల మంది భక్తులు అత్యంత భక్తి ఉత్సాహాలతో పాల్గొన్నారని విజయ్ చవ్వ పేర్కొన్నారు. ఈ సంవత్సరం సుమారు 10 వేల మంది అమెరికాలోని వివిధ నగరాల్లో ప్రవాస భారతీయులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నామని తెలిపారు. అట్లాంటా, బే ఏరియా, షికాగో, డెట్రాయిట్, హ్యూస్టన్, వాషింగ్టన్ డి.సి తదితర నగరాల్లో నిర్వహించే వాసవీ ఉత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
యుద్ధాన్ని, తద్వారా జరిగే రక్తపాతాన్ని నివారించేందుకు వాసవీ మాతగా కూడా భక్తలు పిలుచుకునే వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి తన జీవితాన్ని త్యాగం చేసింది. 'ధర్మం', 'శీలం', 'అహింస' లు కన్యకా పరమేశ్వరి సందేశంగా పేర్కొన్నది. ఇవే సిద్ధాంతాలను ఏసు క్రీస్తు, బుద్ధుడు, మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావులు కూడా అనుసరించారు.
ఎలాంటి లాభాపేక్షా లేకుండా ఏర్పాటైన ఎన్నారై వాసవీ అసోసియేషన్ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహిస్తోందని, ఉత్తర అమెరికాలో ఏర్పాటైన ఈ సంస్థ కన్యకా పరమేశ్వరి సందేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు నడుం కట్టిందని వి.కె. చవ్వ తెలిపారు. విద్యాభ్యాసానికి దూరంగా ఉంటున్న నిరుపేద, పేద విద్యార్థులకు విద్యను, ఆరోగ్యాన్ని అందించేందుకు ఎన్నారై వాసవీ అసోసియేషన్ కృషి చేస్తోందన్నారు. వాసవీ మాత ఆశయాలకు అనుగుణంగా మసలుకొనే ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ సంస్థ అహర్నిశలూ శ్రమిస్తోందని తెలిపారు.
వాసవీ కన్యకా పరమేశ్వరి జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్న నగరాలు తేదీలు ఇవీ:
మే 3 : న్యూ జెర్సీ (నిర్వహణ : ది వాసవీ సొసైటీ)
బే ఏరియా (నిర్వహణ : విఎస్ ఎఫ్, బే ఏరియా)
మే 9 : డిసి\ఎండి\విఎ : (నిర్వహణ : ట్రై స్టేట్ వాసవైట్స్)
రాలీఘ్, ఎన్.సి. : (నిర్వహణ : ట్రైయాంగిల్ వాసవి)
మే 10 : అట్లాంటా : (నిర్వహణ : అట్లాంటా వాసవైట్స్)
బోస్టన్ ఎం.ఎ. : (నిర్వహణ : బోస్టన్ వాసవైట్స్)
డల్లాస్ టెక్సాస్ : (నిర్వహణ : డల్లాస్ వాసవైట్స్)
డెట్రాయిట్, ఎం.ఐ : (నిర్వహణ : డెట్రాయిట్ వాసవైట్స్)
హ్యూస్టన్ టి.ఎక్స్. : (నిర్వహణ : విపిఎస్, హ్యూస్టన్)
లాస్ ఏంజిల్స్, సి.ఎ. : (నిర్వహణ : లాస్ ఏంజిల్స్ వాసవైట్స్)
సెయింట్ లూయీస్, ఎం.ఓ. : (నిర్వహణ : సెయింట్ లూయీస్ వాసవైట్స్)
టెంపా, ఎఫ్.ఎల్. : (నిర్వహణ: టెంపా వాసవైట్స్)
మే 17 : షికాగో, ఐ.ఎల్. (విఎఎన్ఏ, షికాగో)
సాన్ ఆంటోనియో, టిఎక్స్ : (నిర్వహణ : సాన్ ఆంటోనియో వాసవైట్స్)
మరిన్ని వివరాలు కావాల్సిన వారు http://www.nriva.org/ సెట్ లో చూడవచ్చు
News Posted: 4 May, 2009
|