యూటా ఆవిర్భావం
న్యూజెర్సీ : అమెరికాలో కొత్తగా మరో తెలుగు సంస్థ ఆవిష్కృతమైంది. యునైటెడ్ తెలుగు అమెరికన్ అసోసియేషన్ (యూటా - యుటిఏఏ) అనే పేరుతో ఈ సంస్థ ఆవిర్భావ ఉత్సవాలు ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎడిసన్ లోని రాయల్ ఆల్బర్ట్ పేలస్ లో కన్నుల పండువగా జరిగాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ ఆర్గనైజింగ్ కమిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది
వివిధ రంగాల్లో తమ సేవలు అందిస్తూ అమెరికాలో స్థిరపడిన వెయ్యి మందికి పైగా తెలుగువారు ఉత్సాహంగా హాజరైన యూటా సంస్థ ఆవిర్భావ ఉత్సవం కన్నుల పండువగా, విజయవంతంగా జరిగిందని కమిటీ పేర్కొంది. న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రవాసాంధ్ర ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన మ్యాజిక్ షో, ఫేస్ పెయింటింగ్ లాంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించి కరతాళ ధ్వనులు అందుకున్నాయి. కార్యక్రమం ఆద్యంతం చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపింది. మెహిందీ కార్యక్రమంతో మహిళలు తమ తమ ప్రతిభను చాటుకొని అందరినీ ఆకట్టుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం అనితా కృష్ణన్ బృందం నిర్వహించిన వీనుల విందైన సంగీత విభావరి అతిథులను ఆనందసాగరంలో ఓలలాడించింది.
యూటా ఆవిర్భావ ఉత్సవాన్ని దిగ్విజయవంతం చేయడంలో వలంటీర్ల బృందం నిర్వహించిన పాత్ర అనన్యమైనది. ఈ కార్యక్రమం ఏర్పాట్లలో వలంటీర్లంతా కొన్ని వారాలుగా అవిశ్రాంతంగా తమ సేవలు అందించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు అందించిన అభినందన, ప్రోత్సాహాలతో అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని మరింత బలోపేతం చేయడానికి తమకు చక్కని ఔషధంలా పనిచేస్తుందని యూటా ఆర్గనైజింగ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
News Posted: 11 May, 2009
|