బోయిస్ లో ఉగాది ఉత్సవం
బోయిస్ (ఇడాహో స్టేట్) : ఈ సంవత్సరం ఉగాది ఉత్సవాలను బోయిస్ తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. బోయిస్ నగరంలోని బైబిల్ కళాశాలలో ఏప్రిల్ 18న ఈ సంబరాలు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి సింహాచలం పిళ్ళా ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారి ప్రత్యేకతను చాటి చెప్పే ఉగాది ఉత్సవాలకు సుమారు 135 మంది అతిథులు అత్యంత భక్తిశ్రద్ధలతో హాజరయ్యారని ఆయన వెల్లడించారు.
విరోధినామ సంవత్సరం ఉగాది ఉత్సవాల సందర్భంగా ముందుగా పంచాంగ శ్రవణం జరిగింది. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్ షో ఆహూతులను అలరించాయి. పెద్దల విభాగంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత చిన్నారులకు ఆటల పోటీలు అత్యంత ఉల్లాస భరితంగా జరిగాయి. అనంతరం నిర్వహించిన ఉగాది సంబరాల సభా కార్యక్రమంలో తెలుగు సభ్యుల పరిచయ కార్యక్రమాన్నిఉత్సవాల నిర్వాహకులు రాజు జూలకంటి, శ్రీలక్ష్మి పిళ్ళా, సరోజ చల్లగొల్ల ఏర్పాటు చేశారు.
ఉత్సవం గురించి ఓ చిన్న మాట :
బోయిస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనం గా జరిగాయి. ఈ సందర్భముగా జరిగిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నృత్యాలు ఎంతొ అలరించాయి. చిన్నారులు ఆలపించిన శుక్లాంబర ధరం ప్రార్థనా గీతంతో ఉత్సవాలు శుభప్రదంగా మొదలయ్యాయి. ఉత్సవంలో రాజ్ జూలకంటి పంచాంగ శ్రవణం నిర్వహించారు. కన్నుల పండువగా భరతనాట్యం, మురిపించి అలరించిన చిన్నారుల ఫ్యాషన్ షో, చెవులకు ఇంపైన కర్ణాటక సంగీతం, ఊపు అందించిన గ్యాంగ్ లీడర్ డాన్స్, కేరింతలతో పిల్లల ఆటల పోటీలు ఎన్నో కార్యక్రమాలతో సరదాగా, సంబరంగా సాగిపోయింది.
ఆటలు, పాటలు, చప్పట్లు, ఈలలతో అలసిన అతిథులకు ముప్పై రకాల తెలుగు వంటలతో విందు భోజనం ఆహ్వానం పలికింది. ఉగాది పచ్చడి నుంచి, పులిహొర దాకా, గులాబ్ జామూన్ నుంచి క్యారెట్ హల్వా దాకా, పూరీల నుంచి కర్రీ పుఫ్ఫుల దాక బోయిస్ తెలుగు అన్నపూర్ణమ్మలు స్వయంగా చేసి వడ్డించిన విందు భోజనం అందరి నోటా చవులూరించింది. తెలుగు సంస్కృతిని, గొప్పదనాన్ని గుర్తుకు తెచ్చుకుని, తమ పిల్లలతో పంచుకుని, అమెరికాలో ఆంధ్రని చూపించింది బోయిస్ తెలుగు కుటుంబం. వచ్చే ఏడాది మరింత విశిష్టంగా ఉగాది వేడుకలు నిర్వహించాలన్న సంపూర్ణ మనస్సుతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేసుకుంది. బోయిస్ ఉగాది ఉత్సవాలు అతిథుల మనస్సులను ఆసాంతం చూరగొన్నది.
News Posted: 11 May, 2009
|