అట్లాంటాలో వాసవీ జయంతి
అట్లాంటా : 'ధర్మం', 'శీలం', 'అహింస' సందేశాలను ఈ ప్రపంచానికి చాటిచెప్పిన త్యాగశీలి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంత్యుత్సవాలు అట్లాంటాలోని హిందూ దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. అమెరికా వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో రెండు వారాల పాటు కన్యకాపరమేశ్వరి మాత జయంత్యుత్సవాలను ఎన్నారై వాసవైట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే నెల 10 తేదీన వాసవీ జయంత్యుత్సవాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. అమెరికాలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల కోసం అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ఇత్తడితో ప్రత్యేకంగా చేయించిన వాసవీ విగ్రహాలను భక్తులకు అందజేయడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.
అట్లాంటాలో వాసవీ జయంత్యుత్సవాలను నిర్వహించడం ఇది వరుసగా రెండో సారి. వాసవీ మాత చేసిన త్యాగం పట్ల, ఆమె ఈ ప్రపంచానికి అందించిన సందేశం పట్ల అనిర్వచనీయమైన ఆకర్షణ పొందిన అట్లాంటా ఎన్నారైలు ఈసారి ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 150 మంది భక్తులు వాసవీ జయంత్యుత్సవాలలో శ్రద్ధగా పాల్గొని ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
వాసవీ మాత పూజకు ముందుగా అట్లాంటా హిందూ దేవాలయంలోని పూజారులు అమ్మవారి విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ దేవాలయానికి చెందిన నలుగురు పూజారులు ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచీ అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పాటు సహస్రనామం, అష్టోత్తర అర్చన, మంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత పౌరాణికులు వాసవీ జయంతి ప్రాశస్త్యాన్ని, లలితా సహస్రనామమం ప్రాముఖ్యాన్ని భక్తులకు చక్కగా వివరించారు. వాసవీ మాత ప్రవచించిన ధర్మం, శీలం, అహింస సందేశాన్ని వారు సవివరంగా తెలియజెప్పారు. వాసవీ కన్యకా పరమేశ్వరి వృత్తాంతాన్ని చిత్రాలతో సహా వివరించారు. వాసవీ మాత చరిత్ర గురించి, అట్లాంటా హిందూ దేవాలయంలో వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ తదితర విషయాలను బాలు తేటతెల్లంగా తెలియజెప్పారు. అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం, ఒక్కొక్కరూ ఒక్కొక్క నిరుపేద విద్యార్థిని దత్తత తీసుకొని చదివించడం తదితర సేవా కార్యక్రమాల గురించి వక్తలు ఉద్ఘాటించారు.
అట్లాంటాలో కన్యకా మాత జయంత్యుత్సవాలను ఎనిమిది కుటుంబాల వారు పూర్తి అంకిత భావంతో, సమన్వయంతో నిర్వహించారు. చిత్తారి పబ్బా, ఆనంద్ గార్లపాటి ఈ ఉత్సవాల నిర్వహణలో ఎనలేని కృషి చేశారు. చిత్తారి, సామ్ తల్లం, రాఘవ తడవర్తి, నగేశ్ కాసం, గోపాల్ నరసింహన్, సాయి ప్రసాద్ వజ్రమాణిక్యం, అనంత శ్రీరామ, శ్యామ్ పడమటింటి, ఆనంద్ గార్లపాటి తదితర కుటుంబాలకు చెందిన వారు వాసవీ మాత జయంత్యుత్సవాలను చక్కగా సమన్వయం చేయడమే కాకుండా వలంటీర్లుగా మంచి సేవలు అందించారు.
మధ్యాహ్నం నిర్వహించిన విందు భోజనంలో బియ్యంతో తయారు చేసిన 12 రకాల ఆహారపదార్థాలు, మరెన్నో రుచికరమైన పదార్థాలను ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సరఫరా చేశారు. పెనుగొండ వాసవీ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణానందపురి స్వామీజీ, అఖిల భారత వాసవీ పెనుగొండ ట్రస్ట్ మార్గదర్శనంలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇతర దేశాల్లో మొత్తం 50 రాష్ట్రాల్లో ఈ సంవత్సరం వాసవీ జయంత్యుత్సవాలను ఎన్నారై వాసవైట్స్ సంస్థ నిర్వహిస్తున్నది.
News Posted: 11 May, 2009
|