చిన్నజీయర్ యుఎస్ టూర్
న్యూజెర్సీ : పరమాచార్య పెద్ద జీయర్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చిన్నజీయర్ స్వామి నెలరోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకూ పలు నగరాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొని, వేదోక్తమైన పూజలతో పాటు భక్తులకు తమ సందేశాన్ని, శుభాశ్శీస్సులను అందజేస్తారని న్యూజెర్సీలోని జీయర్ సేవాశ్రమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పెద్ద జీయర్ స్వామి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీని, వేద పరిశోధనా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. వేదసూత్రాలు నిర్దేశించిన ప్రకారం మూడంచెల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో చిన్నజీయర్ స్వామి అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో పర్యటించనున్నారు.
ఈ నెల 22న న్యూయార్క్ విమానాశ్రయానికి చిన్నజీయర్ స్వామి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా న్యూజెర్సీలోని క్రాన్ బరీలో ఉన్న జీయర్ ఆశ్రమానికి వస్తారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ప్రజ్ఞా మీట్ లో పాల్గొంటారు. న్యూజెర్సీ ఉన్న అన్ని ప్రజ్ఞా కేంద్రాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారితో ముఖాముఖీ చర్చించి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. 23వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు జీయర్ ఆశ్రమాన్ని ప్రారంభించి, ప్రపంచ శాంతి, అభ్యుదయం కోసం శ్రీ యజ్ఞం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఫిలడెల్ఫియా సబర్బ్ లో ఆధ్యాత్మిక ప్రవచం చేస్తారు.
ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స ప్యాలస్ లో జరిగే 25వ వార్షిక తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఉత్సవాల్లో ప్రధానోపన్యాసం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం స్వామీజీ అమెరికాలోని పలు ప్రధాన నగరాల్లో 27 రోజుల పర్యటించి జూన్ 19న న్యూజెర్సీలోని జీయర్ ఆశ్రమానికి చేరుకుంటారు. స్వామీజీ దైనందిన కార్యక్రమాలు, పర్యటన వివరాల కోసం www.JETNewJersey.org చూడవచ్చు.
భక్తులందరూ 222 డే రోడ్, క్రాన్ బరీ, న్యూజెర్సీ 08512 లో ఉన్న జీయర్ ఆశ్రమాన్ని సందర్శించి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్వామీజీ ఆశీస్సులు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం జీయర్ ఆశ్రమం ఫోన్ నెంబర్ 609-297-8797 ను, JETNewJersey@gmail.com కు ఈ మెయిల్ చేసి గాని సంప్రతించవచ్చు.
News Posted: 11 May, 2009
|