ఎన్నికల ఫలితాల హంగామా
కాలిఫోర్నియా : ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 16, 23 తేదీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెలువరిస్తున్న తరుణంలో ఈ నెల 15 శుక్రవారం రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ బిర్యానీ హౌస్, ఫ్రీమాంట్ హబ్, ఫ్రీమాంట్, కాలిఫోర్నియాలో 'ఎన్నికల ఫలితాల హంగామా' నిర్వహిస్తున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ - ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ ప్రకటించారు. ఆ రోజున టివి9 ద్వారా ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నట్లు ఆయన వివరించారు. అదే రోజున ప్రపంచంలోని మరికొన్ని చోట్ల కూడా ఇదే విధంగా ఎన్నికల ఫలితాల హంగామా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస మానాప్రగడ తెలిపారు. ఈ హంగామాకు ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాస, బిజెపి తదితర రాజకీయ పక్షాలకు మద్దతు ఇచ్చిన ఎన్నారైలు, మిత్రులు, ఆయా పార్టీల శ్రేయోభిలాషులు హాజరు కావచ్చని ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హంగామా నిర్వాహకులు చంద్రు శీలం, శ్రీనివాస మానాప్రగడ, శ్రీకాంత్ పలివెల, రామ్ తోట, శేఖర్ గంజి మాట్లాడుతూ,
ఇటీవలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవాసాంధ్రులు, సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర రాజకీయ నాయకులతో భేటీ అవుతున్న సందర్భాల్లో అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తి, ఉత్కంఠ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ ఎన్నికల ఫలితాలను అందరూ అన్ని పార్టీల మద్దతుదారులు ఒకే వేదిక వద్ద కలిసి కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతున్నది, ఎవరికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టబోతున్నారన్న విషయాలను విశ్లేషించుకునేందుకు వీలుగా ఈ 'హంగామా' ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఎన్నికల ఫలితాల హంగామా కార్యక్రమానికి హాజరయ్యే ఉత్సాహవంతులైన ప్రవాసాంధ్రులకు ఆహారం, పానీయాలను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ తెలిపారు. లాస్ ఏంజిల్స్, షికాగో, వాషింగ్టన్ డిసి, అట్లాంటా, న్యూజెర్సీ, న్యూయార్క్, డెట్రాయిట్, డల్లాస్, యుకె, ఐర్లండ్, జర్మనీ, మస్కట్, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కూడా ఎన్నికల ఫలితాల హంగామా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆయా స్థానిక ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ విభాగాలతో సంప్రతిస్తున్నట్లు చెప్పారు.
News Posted: 13 May, 2009
|