టిఎఫ్ ఎఎస్ రజతోత్సవాలు
న్యూజెర్సీ : తెలుగు కళా సమితి రజతోత్సవాలకు న్యూజెర్సీ నగరం ముస్తాబవుతోంది. ఈ సంస్థ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున రజతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టిఎఫ్ ఎస్ ఎ అధ్యక్షుడు దాము గేదెల తెలిపారు. తెలుగువారి సంప్రదాయ శైలిలో పండుగలు, వేడుకలను జనరంజకంగా నిర్వహిస్తున్న తెలుగు కళా సమితి స్వర్ణోత్సవాల నిర్వహణలో తనమునకలై ఉంది. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం గత ఆరు నెలలుగా టిఎఫ్ఎస్ఎ ఎగ్జిక్యూటివ్ సభ్యులు అవిశ్రాంతంగా కృషిచేసింది.
న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో రెండు రోజుల పాటు మే 23, 24 తేదీల్లో జరిగే తెలుగు కళా సమితి వేడుకలకు భారతదేశం నుంచి పలువురు అతిథులను ఆహ్వానించినట్లు దాము గేదెల తెలిపారు. ఉత్సవాలను శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రారంభించి, ప్రధాన ప్రసంగం చేస్తారు. వేడుకలకు ముఖ్య అతిథిగా న్యూజెర్సీ గవర్నర్ జాన్ కర్జిన్ హాజరవుతున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలోని నటీనటులు, హాస్య నటులు ఈ ఉత్సవాలకు ఆహ్వానించామని దాము గేదల తెలిపారు.తరుణ్, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, రోజారమణితో పాటు సంగీత దర్శకులు చక్రి, వందేమాతరం శ్రీనివాస్, గాయనీమణులు సునీత, మాలతి, వినోద్ బాల తదితరులు హాజరవుతున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 23న రివర్స్ గేర్ కార్యక్రమం, బాంక్వెట్ మ్యూజిక్ నైట్ ను ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు జి. ఆనంద్, శివప్రసాద్ బృందం నిర్వహిస్తారని దాము గేదెల వివరించారు. తెలుగు కళా సమితి ఉత్సవాలలలో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. వెంపటి రవిశంకర్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యం, ప్రముఖ కవి జొన్నవిత్తుల రచించిన తెలుగు వైభవం ప్రదర్శన ఉంటుంది. ట్రైస్టేట్స్ కు చెందిన సుమారు వంద మందికి పైగా విద్యార్థులు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.
తెలుగు కళా సమితి రజతోత్సవాలను పురస్కరించుకొని వివిధ రంగాల్లో చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షుడు దాము గేదెల తెలిపారు. బిజినెస్, సాహిత్యం, సిఎంఇ, యువజన సదస్సులు, మ్యూజికల్ అవార్డులు, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు అతిథులను, ఆహూతులను అలరించే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలు జరిగే రెండు రోజులూ వేదిక రాయల్ ఆల్పర్ట్ ప్యాలస్ వద్ద పలు వ్యాపార సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఇతర వివరాలు కావాల్సిన వారు www.tfasnj.org లేదా ప్రెసిడెంట్ దాము గేదెలను 856-577-7112 ఫోన్ నంబర్ లో సంప్రతించవచ్చు.
News Posted: 18 May, 2009
|