ప్రవాసాంధ్ర 'సత్తా' ప్రతిజ్ఞ
హైదరాబాద్ : కులం, మతం, ప్రాంతం, భాషా వివక్షలు లేని సరికొత్త సమాజాన్ని సృష్టించే రాజకీయాన్ని దేశంలో ప్రతిష్టించడమే తమ లక్ష్యమని పీపుల్ ఫర్ లోక్ సత్తా ప్రతినిధులు సత్య సురేష్ దోనేపూడి, క్రాంతి గడ్డం, ప్రసాద్ గట్టు తదితరులు ప్రకటించారు. దేశ విదేశాల్లో లోక్ సత్తా సభ్యుల సంఖ్యను పెంచడం, నిధులు సేకరించడం లాంటి కార్యక్రమాలను ముమ్మరం చేస్తామని వారు పేర్కొన్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లోని ప్రవాస భారతీయ లోక్ సత్తా కార్యకర్తల సంస్థ పీపుల్ ఫర్ లోక్ సత్తా (www.peopleforloksatta.org) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రకటనను లోక్ సత్తా నాయకులు మంగళవారంనాడు హైదరాబాద్ లో మీడియాకు విడుదల చేశారు. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్త రాజకీయం కోసం పోరాడిన లోక్ సత్తా పార్టీకి ఓటు వేసిన వారందరికీ ప్రవాస భారతీయ లోక్ సత్తా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
అధికారమే పరమావధిగా మూడు సంప్రదాయ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, లోక్ సత్తాకు ఓటు వేడమే ఒక వేస్ట్ అంటూ విష ప్రచారం చేసినా... గెలుపు ఓటములతో నిమిత్తం లేకుడా మార్పు కోసం లోక్ సత్తాకు లక్షల మంది ఓటు వేయడాన్ని ప్రవాస భారతీయ లోక్ సత్తా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఇది నైతిక విజయం అన్నారు. మద్యం, మనీ పంచిపెట్టకుండా కేవలం విధానాల ప్రాతిపదికన సాధించిన ఈ విజయం సామాన్యం కాదన్నారు. భవిష్యత్ లో ఇదే రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తుందన్నారు.
పట్టణ ప్రాంతాల్లో లోక్ సత్తా గణనీయంగా ఓట్లు సాధించిందని, పటిష్టంగా వేళ్ళూనుకున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సత్తా విధానాలు చర్చకు వచ్చాయని ప్రవాస భారతీయ లోక్ సత్తా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత, మధ్య తరగతి ప్రజలు లోక్ సత్తాకు బలమైన ఓటు బ్యాంకుగా నిలిచారన్నారు. పలు బస్తీల్లో కొద్దిగా అక్షర జ్ఞానం ఉన్న వారు కూడా ప్రలోభాలకు లోనవకుండా విజ్ఞతతో లోక్ సత్తాకు ఓట్లు వేశారని వారు అభినందనలు తెలిపారు. పల్లెల్లో కూడా లోక్ సత్తా ప్రచారం సాగించినా అనుకున్న మేరకు ఓట్ల రూపంలో రాబట్టలేకపోయినట్లు వారు విచారం వ్యక్తం చేశారు.
పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ కూకట్ పల్లిలో విజయం సాధించడంతో పాటు, ఎన్నికల ఫలితాలను పలుచోట్ల లోక్ సత్తా ప్రభావితం చేయడం ఆనందంగా ఉందని ప్రవాస భారతీయ లోక్ సత్తా ప్రతినిధులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తాము పార్టీ కోసం చేసిన ఫోన్ ప్రచారం, నిధుల సేకరణ, ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక చేసిన ప్రత్యక్ష ప్రచారానికి తగిన ఫలితం వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు. కూకట్ పల్లిలాంటి విజయాలు రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
News Posted: 19 May, 2009
|