'తెలుగు ఎవరికి కావాలి?'
డల్లాస్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంస్థకు చెందిన తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 22 వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం మే 17న ఘనంగా జరిగింది. స్థానిక స్పైస్ ఇన్ ఇండియన్ రెస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త డాక్టర్ వెల్చేరు నారాయణ రావు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ముందుగా డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి చంధోబద్ధంగా రాసిన ‘వసంత కన్య’ పద్యాలను చదివి వినిపించారు. తరువాత సురేష్ కాజ నూజివీడు మామిడిపండు మీద చందోబద్ధంగా రాసిన పద్యాలను చదివి వినిపించారు. నందివాడ ఉదయ భాస్కర్ స్వీయ కవిత ‘రోజూ చూస్తున్న దౄశ్యమే’ చదివి వినిపించారు. ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ తినుబండారాల మీద చెప్పిన పద్యం ఆహూతులను ఆకట్టుకుంది. అనంతరం చంద్ర కన్నెగంటి తెలుగు భాషలోని సామెతలను సభకు హాజరైన వారితో చెప్పించి అందరినీ ఉత్సాహపరిచారు.
కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు తెలుగు భాషలోని ఉర్దూ పదాల గురించి వివరించారు. కె.సి.చేకూరి శ్రీశ్రీ కవిత్వాన్ని విశ్లేషించారు. చంద్ర కన్నెగంటి ముఖ్యఅతిథి డాక్టర్ వెల్చేరు నారాయణ రావును సభకు పరిచయం చేశారు.
'తెలుగు ఎవరికి కావాలి?' అనే అంశంపై వెల్చేరు నారాయణ రావు సభలో ముందుగా ప్రసంగించారు. అనంతరం మాతృభాష ప్రాముఖ్యతను, తెలుగు నేలపై తెలుగు భాషను కాపాడుకోవలసిన ఆవశ్యకతను, భావితరాలకు తెలుగు సాహిత్యాన్ని అందించవలసిన అవసరాన్నితెలియచేశారు. పిమ్మట ఆసక్తికరంగా సాగిన సాహితీ చర్చలో సాహిత్య ప్రియులు అడిగిన ప్రశ్నలకు నారాయణరావు సవివరమైన సమాధానాలిచ్చారు.
ముఖ్య అతిథిని టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి శాలువతో సత్కరించారు. శాంత పులిగండ్ల పుష్పగుచ్ఛంతోను, సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. రావు కల్వల వందన సమర్పణతో ఈసారి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఉత్సాహహపూరిత వాతావరణంలో ముగిసింది.
News Posted: 20 May, 2009
|