టిసిఎ వనభోజనాలు
కాలిఫోర్నియా : తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ) మే 16 శనివారం నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం చక్కని ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. పచ్చదనంతో అలరాలే హద్దర్ట్ పార్క్ లో ఈ వనభోజనాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని సాన్ కార్లోస్ పర్వత ప్రాంతంపై హద్దర్త్ పార్క్ నెలకొని ఉంది. ఈ వనభోజనాలకు పిల్లలు, పెద్దలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బిక్షం పాలబిందెల తెలిపారు. వేసవి కాలం అయినప్పటికీ, ఉక్కబోత ఎక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ సంప్రదాయ రుచులు, వంటకాల ఘుమఘుమలతో వనభోజన కార్యక్రమం ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ వనభోజనాలకు హాజరైన అందరూ తమ తమ ఇళ్ళలో తయారుచేసుకొని వచ్చిన వివిధ రకాల ఆహార పదార్ధాలను ఇతరులకు కూడా పంచిపెట్టి, ఇతరుల పదార్థాలను తాము ఆస్వాదించి తినడంతో పిక్నిక్ మొత్తం రసవత్తరంగా మారింది.
వనభోజనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బిక్షం పాలబిందెల స్వాగతం పలికారు. బిక్షం స్వాగతోపన్యాసం అనంతరం వనభోజనం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆహార పదార్థాల ఏర్పాటును రాజు యాసల చక్కగా నిర్వహించారు. అతిథి ఇండియన్ రెస్టారెంట్ మరికొన్ని రుచికరమైన పదార్థాలను సరఫరా చేసింది.
మధ్యాహ్న భోజనాల అనంతరం ఉమా చింతలపాటి చిన్నారి కళాకారులు శిల్ప, ఐశ్వర్య, హంసిక, శ్వేత, సంస్వర, పెద్దలు ఉమ, చూడామణి, జయ, అనిత పాలబిందెల నృత్య, గాన కార్యక్రమాలను నిర్వహించారు. కళాకారుల పాటలు, అతిథుల చప్పట్లతో సాన్ కార్లోస్ పర్వత ప్రాంతం మార్మోగిపోయింది. టిసిఎ వైస్ ప్రెసిడెంట్ అర్షద్ హుస్సేన్ పిల్లలు, పెద్దల విభాగాల్లో బింగో గేమ్, పరుగుపందెం, మ్యూజికల్ బాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు.
భారతదేశంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టిసిఎ వనభోజనాల కార్యక్రమం ప్రారంభం కావడంతో ఆహూతులందరూ ఫలితాలపైనే ఆసక్తికరంగా చర్చించుకున్నారు. వివిధ పార్టీల అభిమానులు ఫలితాల గురించి చర్చించుకోవడంతో వనభోజన కార్యక్రమం కాస్తా రాజకీయ వేదిక (రాజకీయ రచ్చబండ) గా మారిపోయింది.
టిసిఎ వనభోజనాలకు విజయ్ చవ్వ, గట్టు ప్రసాద్, శ్రవణ్ బెల్లాల్, గందె తిరుపతయ్య, చక్రి రవడ, ప్రసాద్ మంగిన, సైదేష్ అజ్జన్, శ్రీనివాస్ గుజ్జ, బాల్ రాజు గార్లపాటి, గడంశెట్టి సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. వనభోజనాలకు హాజరైన వారికి, స్పాన్సర్లు భారత్ ఫ్యామిలీ డాట్ కామ్, శ్రీ కల్పతరు డాట్ కామ్, రీటా బ్యూటీ సెలూన్ లకు టిసిఎ కోశాధికారి భాస్కర్ మద్ది ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 20 May, 2009
|