డల్లాస్ లో సుదర్శన హోమం
డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తూ డల్లాస్ లోని ప్రవాసాంధ్రులు సుదర్శన ఆంజనేయ హోమం నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయినందుకు కూడా వారు ఈ హోమాన్ని నిర్వహించారు. కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు, అభివృద్ధితో ఉండాలని ప్రవాసాంధ్రులు ఈ హోమాన్ని నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిత్యం కృషి చేసే హరితాంధ్రప్రదేశ్ లక్ష్యం సంపూర్తిగా నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఏడుకొండల వాడిని వేడుకున్నారు. అలాగే తెలుగు ప్రజలంతా సుభిక్షంగా, ఆనందంగా ఉండేలా చూడాలని ఈ హోమం సందర్భంగా ప్రవాసాంధ్రులు వేంకటేశ్వరస్వామిని ప్రార్థించారు.
డల్లాస్ లోని హిందూ దేవాలయంలో జరిగిన ఈ సుదర్శన ఆంజనేయ హోమాన్ని డాక్టర్ శ్రీలతారెడ్డి \ గుర్రం శ్రీనివాసరెడ్డి కుటుంబంతో పాటు డాక్టర్ రాజ్ నరేందర్ రెడ్డి, డాక్టర్ మహేశ్ తుమ్మల, డాక్టర్ విజయ్ రెడ్డి \ డాక్టర్ తనూజారెడ్డి, డాక్టర్ ప్రతాప్ తుమ్మల, డాక్టర్ గునుకుల శ్రీనివాసరెడ్డి తదితరులు నిర్వహించారు. హిందూ దేవాలయంలోని వెంకట రమణాచార్యులు వైఖానస ఆగమ శోస్త్రోక్తంగా ఈ హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు.
రాష్ట్రంలో 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల సాధక బాధకాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారని, ఆ అనుభవమే చక్కని, ప్రజోపయోగ విధానాల రూపకల్పన చేయడానికి ఆయనకు దోహదం చేసిందని ప్రవాసాంధ్రులు గుర్తుచేసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి మూలా అభివృద్ధి చెందాలని, హరితాంధ్ర ప్రదేశ్ గా రూపు దిద్దుకోవాలని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆకాంక్షించారు.
News Posted: 27 May, 2009
|