డల్లాస్ లో కోటి బర్త్ డే
డల్లాస్ : ప్రముఖ తెలుగు సినీ నేపథ్య సంగీత దర్శకుడు సాలూరి కోటి జన్మదినోత్సవాన్ని మే 29 శుక్రవారంనాడు డల్లాస్ లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. లెవీస్ విల్లెలోని కోకిల ఇండియన్ రెస్టారెంట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికు సుమారు వంద మంది కోటి మిత్రులు, అభిమానులు హాజరయ్యారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రులైన డాక్టర్ శ్రీనివాసరెడ్డి, రవి మన్నేపల్లి తదితరుల అభినందనల మధ్య తన బర్త్ డే కేక్ ను కోటి కట్ చేశారు.
కోటి బర్త్ డా కార్యక్రమాన్ని ఎం.వి.ఎల్. ప్రసాద్ నిర్వహించారు. తెలుగు సినీ సంగీత దిగ్గజం, వందలాది సినిమాలకు చక్కని నేపథ్య సంగీతం అందించిన సాలూరు రాజేశ్వరరావు కుమారుడైన కోటిని డాక్టర్ రెడ్డి ఆహూతులకు పరిచయం చేశారు. కోటి కూడా తన తండ్రిగారి వారసత్వాన్నే కొనసాగిస్తున్నరని కొనియాడారు. సంగీత దర్శకుల్లో ప్రసిద్ధులైన ఎ.ఆర్.రహ్మాన్, మణిశర్మ, హారిస్ జయరాజ్ తదితరులకు తొలి రోజుల్లో తన బృందంలో అవకాశం కల్పించిన ఘనత కోటికే దక్కుతుందని ప్రశంసించారు.
కోటి డల్లాస్ సందర్శించటానికి జ్ఞాపకంగా టాన్ టెక్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, ఆ సంస్థ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కోటిని శాలువ కప్పి, నిలువెత్తు గులాబీ పూలదండ వేసి, జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. తన జన్మదినోత్సవం నిర్వహించేందుకు అతి తక్కువ సమయంలోనే అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసిన డాక్టర్ రెడ్డి, ప్రసాద్ తోటకూర, రావు కల్వల, రామ్ కి చేబ్రోలు, ఎం.వి.ఎల్. ప్రసాద్ లకు కోటి ధన్యవాదాలు తెలిపారు. 'నా జీవితంలో ఈ పుట్టిన రోజు మరిచిపోలేనంత ప్రత్యేకమైనది. అమెరికాలో ఇంతమంది అభిమానులు, మిత్రుల మధ్య తాను చేసుకున్న తొలి పుట్టిన రోజు ఇదే' కోటి హర్షం వ్యక్తం చేశారు.
కోటి బర్త్ డే కేక్ ను కట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ వెంటనే కోటి సంగీత విభావరి మొదలైంది. కోటి, స్థానిక గాయకులు కూడా ఆయనే సంగీత దర్శకత్వం వహించిన పాటలు పాడి అందరినీ ఆనంద డోలికల్లో ముంచెత్తారు. కోటికి, డాక్టర్ రెడ్డికి, చక్కని ఆతిథ్యం ఇచ్చిన రెస్టారెంట్ యాజమాన్యానికి, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ రావు కల్వల ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 1 June, 2009
|