లండన్ లో 'జయహో వైఎస్'
లండన్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్ళీ ఎన్నికైనందుకు విదేశాల్లోని తెలుగు వారు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. 'జయహో వైఎస్' నినాదాలు లండన్ వీధుల్లో మార్మోగాయి. మొన్న కువైట్, నిన్న అమెరికా, నేడు లండన్... ఇలా ప్రపంచవ్యాప్తంగా వైఎస్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ysfanclub సభ్యులు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వైఎస్ విజయోత్సవాలలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు.
ఈ క్రమంలో లండన్ లోని East hamలో 300 మందితో తొలిసారిగా జరిగిన వైఎస్ విజయోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి ysfanclub UK విభాగం అధ్యక్షుడు కందుకూరి అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా National Health serviceలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో సుమారు 50 మంది రక్తందానం చేసి వైఎస్ పట్ల తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. శిబిరంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆసుపత్రి డైరెక్టర్ మాట్లాడుతూ, ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చెయ్యటం తమ ఆసుపత్రి చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలను ఆయన స్వయంగా, ఆసక్తిగా అడిగి తెలుసుకొని అభినందించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఉపాధ్యక్షుడు గిరికుమార్ మాట్లాడుతూ, వైఎస్ చేసిన సంక్షేమ పధకాల ద్వారా చాలా మంది లబ్ధి పొందారన్నారు. ప్రముఖ వైద్యులు మహేష్, రవికుమార్ రెడ్డిలు వైఎస్ చేసిన సేవలను కొనియాడారు. ysfanclub, Uk అధ్యక్షుడు కందుకూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ, మంచి చేసే వారిని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, రాజశేఖరరెడ్డి ఒకే ఒక్కరై గెలుపు, ఓటములను తన భుజస్కంధాలపై వేసుకొని విజయసారథి అయ్యారని ప్రశంసించారు. సరైన సమయంలో 'సాక్షి' పత్రిక, టీవీ ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషిచేసిన వైఎస్ జగన్ కు పాదాభివందనాలు అని ఉద్వేగభరితంగా చెప్పారు. విదేశాలలో తెలుగు విద్యార్ధులపై జరుగుతున్న దాడులను ఈ సందర్భంగా ఖండించారు.
అనతరం జరిగిన రెండు కిలోమీటర్ల పాదయాత్ర, పది మైళ్ళ కారు ర్యాలీలో యువత పెద్ద ఎత్తున, ఉత్సాహంగా పాల్గొన్నారు. 'జయహో వైఎస్సార్', 'జయహో కాంగ్రెస్' అనే నినాదాలతో లండన్ వీధులన్నీ మారుమోగిపోయాయి. బ్రిటిష్ ప్రజలు కూడా ఈ ర్యాలీని ఆసక్తిగా తిలకిస్తూ, ఏమి జరుగుతుందో తెలుసుకొని, వారు కూడా అభినందనలు తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ysfanclub యూత్ విభాగం నాయకులు చరణ్ రెడ్డి, సంజీవ్ మరికంటి, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొని రాజశేఖరరెడ్డి మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని East hamలోని మహాలక్ష్మిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News Posted: 2 June, 2009
|