తానా సూపర్ సింగర్ పోటీ
న్యూజెర్సీ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) - మా టీవీ సంయుక్తంగా సూపర్ సింగ్ ప్రాథమిక రౌండ్ పోటీలు మే 30 నుంచి జూన్ 20 వరకూ నిర్వహిస్తున్నట్లు 17వ తానా సభల సాంస్కృతిక విభాగానికి చెందిన లక్ష్మి దేవినేని ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, కెనడాల్లో ఉంటున్న ప్రతిభావంతులైన తెలుగు గాయనీ గాయకుల చక్కని అవకాశం కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. సూపర్ సింగర్ ప్రాథమిక పోటీలు మొత్తం మూడు రౌండ్లలో జరుగుతాయి. జూలై 3 నుంచి షికాగోలో జరిగే తానా సభల ప్రధాన వేదిక మీద ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను మా టీవీ ప్రసారం చేస్తుంది.
తొలి రౌండ్ పోటీలు ఓర్లాండో, వాషింగ్టన్ డిసి, డల్లాస్, డెట్రాయిట్, న్యూజెర్సీ, సాన్ జోస్, టోరంటో నగరాల్లో మే 30 జూన్ 20 తేదీల మధ్య నిర్వహిస్తారు. ఒక్కొక్క వేదిక నుంచి అత్యంత ప్రతిభ ప్రదర్శించిన ఇద్దరు పోటీదారులు తానా సభలకు ముందు రోజు జూలై 2న ప్రధాన వేదిక మీద సెమీ ఫైనల్స్ లో పాడాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్స్ నుంచి ఎంపికైన ఇద్దరు పోటీదారులు తానా సభల తొలిరోజు జూలైన 3న ప్రధాన వేదికపైన టైటిల్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది. సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు రెండింటినీ మాటీవీ ప్రసారం చేస్తుంది.
సూపర్ సింగర్ పోటీలో పాల్గొనే వారికి నిబంధనలు :
- అమెరికా, కెనడాల్లో నివసిస్తున్న తెలుగువారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.
- పోటీలో పాల్గొనే వారు 14 ఏళ్ళ వయస్సు లేదా అంతకు పైబడిన వారు మాత్రమే పాల్గొనాల్సు ఉంటుంది.
- పోటీదారులు తెలుగుభాషలోని సోలో పాటలు మాత్రమే పాడాలి. ఇతర భాషల పాటలను అనుమతించబోరు.
- ఈ పోటీ శాస్త్రీయ సంగీతంలో పోటీ కాదు. కనుక లలిత సంగీతం, జానపదం, సినిమా పాటల్లో ఏవైనా పాడవచ్చు.
- న్యాయనిర్ణేతల నిర్ణయమే తుది నిర్ణయం. దీనిపై ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
ఇతర వివరాలు, మార్గదర్శకాలు, రిజిస్ట్రేషన్ తదితరాల కోసం www.tana09.com లో చూడవచ్చు.
News Posted: 2 June, 2009
|