అభాగ్యుల సేవలో భారత్ గ్రూప్
పెన్సిల్వేనియా : గృహ హింస బాధితులైన దక్షిణాసియా మహిళలకు చేయూతనిచ్చేందుకు భారత్ యూత్ గ్రూప్ సంస్థ ముందుకు వచ్చింది. అలాంటి వారికి ఆశ్రయం కల్పించడానికి అవసరమైన నిధుల సేకరణ కోసం మే 30న భారత్ యూత్ గ్రూప్ 'ఫ్యూజన్ 2009' పేరుతో సాంస్కృతిక పోటీలు నిర్విహించింది. ఈ పోటీల ద్వారా వసూలైన మొత్తాన్ని గృహ హింసకు గురై ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని సంకల్పించింది. నార్త్ వేల్స్ లోని పెన్ బ్రూక్ మిడిల్ స్కూల్ లో ఈ ఫండ్ రైజింగ్ పోటీలు నిర్వహించింది.
శాస్త్రీయ, జానపద, సినిమా నృత్యాలు, శాస్త్రీయ, లలిత సంగీతం, ఇన్ స్ట్రుమెంటల్ తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల నుంచి 160 మందికి పైగా ఉత్సాహవంతులైన చిన్నారి కళాకారులు పాల్గొన్నారు. 450 మందికి పైగా హాజరైన అతిథుదులతో హాలు మొత్తం కిటకిటలాడిపోయింది.
భారత, అమెరికా జాతీయ గీతాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం జరిగిన పోటీల కార్యక్రమాన్ని కీర్తన శెట్టి, వంశీ వుప్పల నిర్వహించారు. విజేతలకు బహుమతుల ప్రదానం అనంతరం పెన్సిల్వేనియా నుంచి వచ్చిన రవి ముక్కామల, న్యూజెర్సీ నుంచి వచ్చిన హేమబిందు సంగీత విభావరి నిర్వహించారు. ఈ సంగీత విభావరి అతిథులను అమితంగా ఆకట్టుకుంది. భారత్ యూత్ గ్రూప్ నిర్వహించిన అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాంస్కృతిక కమిటీ సభ్యులు జయశీల శెట్టి, అనూజ గేదెల, మేఘనారెడ్డి, అవినాష్, అభినవ్ గబ్బెట, అరుణ్ పిడుగు, భాస్కరి బుద్ధవరపు అహరహం శ్రమించారు. ఆహారం, ప్రచార కార్యక్రమాలను హర్ష రొయ్యూరు, మిథాలి పంచని పర్యవేక్షించారు.
ఈ ఫండ్ రైజింక్ కార్యక్రమం ద్వారా 8,550.01 డాలర్ల విరాళం సమకూరినట్లు పవన్ గేదెల, అనూజ గేదెల ప్రకటించారు. ఈ మొత్తాన్ని పెన్సిల్వేనియాలోని సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ ఎగెనెస్ట్ అబ్యూజ్ - సేవా సంస్థకు అందజేయనున్నట్లు వారు ప్రకటించారు. భారత్ యూత్ గ్రూప్ అధ్యక్షురాలు కీర్తన శెట్టి తమ సంస్థ సభ్యులను అతిథులకు పరిచయం చేస్తూ తాము సేవా సంస్థను స్థాపించడానికి వెనుక ఉన్న కారణాలను వివరించారు. అలాగే 2009 -10 సంవత్సరానికి ఎంపికైన కమిటీ సభ్యులను కూడా ఆమె పరిచయం చేశారు. ఈ కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ ఉజ్వల దీక్షిత్, ఉపాధ్యక్షురాలిగా శ్రీమతి సరోజ సగరం విజేతలకు బహుమతులు అందజేశారు. అవినాష్ గబ్బెట సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 3 June, 2009
|