వైఎస్ కు ఆటా అభినందన
న్యూయార్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అమెరికా తెలుగు సంఘం (ఆటా) అభినందనలు తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆటా అధ్యక్షుడు ఎం. జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. అలాగే చరిత్రలో తొలిసారిగా హోం మంత్రిగా నియమితురాలైన మహిళా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డికి, 13వ అసెంబ్లీకి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయడు, కొణిదెల చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ్, జి. కిషన్ రెడ్డిలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.
ఒక మహిళకు హోం మంత్రి పదవీ బాధ్యతలు అప్పగించడం నిజంగా మహిళా లోకానికి వైఎస్ రాజశేఖరెరెడ్డి అపూర్వమైన గౌరవం అని, చారిత్రాత్మకం అన్నారు. మహిళ అయిన సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రి పదవిని చేపట్టడం అంటే ప్రపంచంలోనే తెలుగు మహిళ సగర్వంగా తలెత్తుకు తిరిగే సంఘటన అన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి - ఆటా సంస్థ మధ్య చక్కని సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు జితేందర్ రెడ్డి అన్నారు.
News Posted: 6 June, 2009
|