అట్లాంటాలో వైఎస్ జయహో
అట్లాంటా : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభిమానుల సంఘం అట్లాంటాలో నిర్వహించిన 'జయహో' విందు ఆసాంతం ఒక ఉత్సవంలా జరిగింది. జూన్ 5 శుక్రవారంనాడు అట్లాంటాలోని హాలిడే ఇన్ లో ఈ కార్యక్రమాని అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో హాలు కిక్కిరిసిపోయింది. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారీ బాధ్యతలు చేపట్టినందున ఆహూతులందరి కళ్ళలోను సంతృప్తి వ్యక్తమైంది.
కార్యక్రమంలో తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఘట్టాన్ని గౌరవంగా లేచి నిలబడి విని పులకించిపోయారు. హద్దుల్లో ఉన్న అభిమానంతో, క్రమశిక్షణతో అభిమానులంతా సుశిక్షితులైన సైనికుల్లా హుందాగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి వైఎస్ పంపించిన వీడియో సందేశాన్ని అందరూ మళ్ళీ మళ్ళీ వీక్షించి సంతోషించారు. ఉన్నత విద్యాశాఖ, ప్రవాసాంధ్రుల సంక్షేమ శాఖ మంత్రి దుద్దిళ్ళి శ్రీధర్ బాబు పంపిన వీడియో సందేశాన్ని కూడా ఆహూతులంతా విని హర్షం వ్యక్తం చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, విజయవాడ ఎం.పి. లగడపాటి రాజగోపాల్ లైవ్ టెలిఫోన్ కాల్ లో తమ సందేశాలు అందించారు. ఆ సందాశాలు వింటూ అభిమానులు చేసిన జయ జయ ధ్వానాలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది.
అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేలా, ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరిగేలా కృషిచేస్తానంటూ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రొద్దుటూరు నుంచి వచ్చిన గురివిరెడ్డి, స్థానిక వక్తలు బాల ఇందుర్తి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనాథ్, సింగారెడ్డి రవి, రమేష్ నల్లపు, శివరాం మట్టేపల్లి, మోహనరెడ్డి, నరేంద్రరెడ్డి, కోదండ రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ విజయ విశేషాలను, వైఎస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, రుణాల మాఫీ, పావలా వడ్డీ పథకం వంటి అనేక ప్రజోపయోగ కార్యక్రమాల గురించి వివరించారు. కార్యక్రమం నిర్వాహక వర్గం సభ్యులు సత్యనారాయణరెడ్డి, కరుణాకర్ రెడ్డి, రమణారెడ్డి, కొట్లూరి శ్రీనివాసరెడ్డి, గిరీష్ రెడ్డి మేక, వెంకట్రామిరెడ్డి కూడా ఇదే వేదికపై నుంచి తమ అనుభవాలను నెమరువేసుకున్నారు.
కార్యనిర్వాహక వర్గం ప్రతినిధి పుణ్యాల గురవారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ జైత్రయాత్ర భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫణి డొక్కా, సత్య కర్నాటి హృద్యమైన గేయాలతో ఆహూతులను అలరించారు. శ్రీ సాయి మురళి రెస్టారెంట్ రుచికరమైన విందు భోజనాన్ని, శీతల పానీయాన్ని అందించింది. వేణు పోలిశెట్టి ఫొటోగ్రఫీ సహకారం అందించారు. సుమారు మూడు గంటలపాటు ఆనందంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి డొక్కా ఫని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలాంటి పండుగలు మళ్ళీ మళ్ళీ నిర్వహించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమకెంతో ఆనందంగా ఉందని అభిమానులంతా పలుమార్లు 'జయహో' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి అనుకూలమైన హాలును సమకూర్చిన పాడీరావుకు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ వందన సమర్పణతో నిర్వాహకులు కార్యక్రమాన్ని ముగించారు.
News Posted: 10 June, 2009
|