2 నుంచి తానా సభలు
హైదరాబాద్ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 17వ మహాసభలు జూలై 2 నుంచి 4వ తేదీవరకు చికాగోలో నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడిగా ఎంపికైన కోమటి జయరాం వెల్లడించారు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి 25 కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేశామని, సుమారు ఎనిమిదేవేల మంది ఈ మహాసభలో పాల్గొంటారని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. మా టీవీ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల మహాసభలో సూపర్ సింగర్స్ పోటీ, వ్యాపార, సాంస్కృతిక, మహిళా, యువ, ఆధ్యాత్మిక సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులను కూడా ఆహ్వానించామని ఆయన చెప్పారు. రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవిరెడ్డి వ్యాపార సదస్సులో కీలకోపన్యాసం చేస్తారని, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రామానాయుడు, ఎల్లా కృష్ణా, గల్లా జయదేవ్, టిహెచ్ చౌదరీ, జాస్తి వెంకట్ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు. కవులు కళాకారులు మేడసాని మోహన్, రాళ్ళబండి కవితాప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, శ్రీ రమణ, వాసిరెడ్డి నవీన్, అందెశ్రీ తదితరులు వివిధ కార్యక్రమాలు ఇస్తారని ఆయన చెప్పారు. సినీగాయకులు బాలు బృందం, నటులు మురళీమోహన్, సుమంత్, అల్లరినరేష్, రాజీవ్ కనకాల, భూమిక, స్వాతి, టీవీ యాంకర్లు సుమ, ఝాన్సీ తదితరులు పాల్గొంటారని వివరించారు.
వరంగల్ లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి బాధితురాలు ప్రణీతకు మెరుగైన వైద్యాన్ని విదేశాల్లో అందించేందుకు అయ్యే ఖర్చును తానా భరిస్తుందని జయరాం చెప్పారు. విదేశీప్రయాణానికి ఆమె ఆరోగ్యం సహకరిస్తుందని డాక్టర్లు చెప్పినప్పుడు, వారి సలహామేరకు ఆమెను విదేశాలకు తీసుకువెళ్ళి మెరుగైన చికిత్స అందించే ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
యాసిడ్ తో దాడి జరిగిన తరువాత జీవితమే లేదనుకున్న తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొత్త జీవితాన్ని ఇచ్చారని ప్రణీత అన్నారు. మీడియా ఇచ్చిన ఆత్మస్థైర్యంతోనే తాను కోలుకోగలిగానని, ఇప్పుడు విదేశాల్లో వైద్య ఖర్చులను భరిస్తామంటూ తానా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రణీత తెలిపారు. తనపై జరిగిన దాడి మరెవ్వరిపై జరగకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆమె కోరారు.
News Posted: 10 June, 2009
|