టికెఎస్ 'విజయీభవ'
సౌదీ అరేబియా : సౌదీ అరేబియా తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవాలు 'విజయీభవ' దమ్మామ్ లో ఘనంగా జరిగాయి. జూన్ 12 శుక్రవారం ఉదయం 'మా తెలుగుతల్లికి మల్లె పూదండ', 'ఖురాన్ పఠనం'తో సంబరాలు ప్రారంభమయ్యాయి. తెలుగు కళా సమితి అధ్యక్షుడు ఫైజల్ జంగ్ స్వాగతోపన్యాసంతో కొత్త కమిటీ సభ్యులను పరిచయం చేశారు.
ఈ సంబరాల్లో చిన్నారులకు విచిత్ర వేషధారణ పోటీలు కూడా నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ శుక్రవారంనాడు సెలవురోజు కావడంతో సంబరాలకు విశేష సంఖ్యలో అతిథులు హాజరయ్యారని సౌదీ అరేబియాలోని తెలుగు కళా సమితి సాంస్కృతిక విభాగం కార్యదర్శి భానుప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు ఏడు వందల మందికి పైగా అతిథులు ఈ వార్షికోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కూచిపూడి నృత్యం, లఘు నాటికలు, సినిమా పాటలకు నృత్యాలు తదితర అంశాల్లో సుమారు 70 మంది కళాకారులు ఈ సంబరాలకు హాజరైన వారికి కనువిందు చేశారు. ప్రముఖ సినీ హాస్య నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఈ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమారు రెండు గంటల పాటు ఆయన తన వాక్చాతుర్యంతో, మిమిక్రీ నైపుణ్యంతో అందరినీ ఎంతగానో అలరించారు. సౌదీ అరేబియాలో ఒక తెలుగు సినీ, స్టేజ్ కళాకారుడు ప్రదర్శనలో పాల్గొనడం ఇదే తొలిసారి.
గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ఆంధ్రులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలుగు కళా సమితి ప్రతినిధి ఖాలిద్ తెలిపారు. తెలుగు కళా సమితి, అనుబంధ సంస్థ తెలుగు సమాఖ్య, జుటైల కటిమీ సభ్యుల సమష్టి కృషిని తెలుగు అతిథులు ప్రశంసలతో ముంచెత్తారు.
News Posted: 15 June, 2009
|