చక్రికి న్యూజెర్సీలో సన్మానం
న్యూజెర్సీ : ప్రముఖ సినీ నేపథ్య సంగీత దర్శకుడు చక్రికి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా సన్మానం జరిగింది. జూన్ 15 ఆదివారం సాయంత్రం న్యూజెర్సీలోని రాయల్ ఆల్బెర్ట్ ప్యాలస్ లో కన్నులపండువగా నిర్వహించిన కార్యక్రమంలో వివిధ తెలుగు సంఘాలు, సంగీత అభిమానులు సంయుక్తంగా చక్రిని సాదరంగా సన్మానించారు.
తెలుగు సంగీతాభిమానులను ఒక ఊపు ఊపుతున్న 'గోపి గోపిక గోదావరి' చిత్రంలోని పాటల ఈ సందర్భంగా చక్రి, గాయని విజయలక్ష్మి గానం చేసి ఆహూతులందర్నీ ఆనంద డోలికల్లో ముంచెత్తారు. ఈ చిత్రంలోనీ పాటలకు చక్రి సంగీతం సమకూర్చారు. వీరికి స్థానిక గాయనీ గాయకులు రాజీవ్, బాబా, హిమబిందు, భరత్, సందీప్ కూడా తోడై కార్యక్రమాన్ని ఆద్యంతమూ రక్తి కట్టించారు. ఆనాటి మేటి సినిమాల్లోని పలు ఆపాతమధుర గీతాలను చక్రి, విజయలక్ష్మి శ్రావ్యంగా పాడి వినిపించారు. చక్రి, విజయలక్ష్మి పాటలకు పలువురు యువకులు నాట్యంతో జత కలిశారు. మహేశ్ సలాది తనదైన శైలిలో హాస్య చతురోక్తులతో ఈ కార్యక్రమాన్ని ఓ చక్కని అనుభూతిగా నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రి తన అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టిన రోజు సంబరం జరుపుకున్నారు.
చక్రి సన్మాన కార్యక్రమాన్ని రమేష్ చంద్ర ఆవునూరు, రవి ధన్నపనేని, శ్రీనివాస్ గనగోని, సందీప్, రవి తోట చక్కని సమన్వయంతో నిర్వహించారు. సుమారు ఐదు వందల మంది తమ కుటుంబాలతో చక్రి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలనాటి సినీనటి రోజారమణి, శ్రీమతి చక్రి, న్యూయార్క్, న్యూజెర్సీలలోని తెలుగు కమిటీల నాయకులు దామోదర్ గేదెల, ఆనంద్ పాలూరి, సతీష్ దాసరి, నటరాజ్ గంధం, దీపక్, గోపి, వంశీ కె., సంతోష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాని హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు. సంగీతాభిమానులు, చక్రి ఫాన్స్ మరింత ఆనందానుభూతి పొందేందుకు కార్యక్రమం నిర్వాహకులు చక్కని రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.
News Posted: 18 June, 2009
|