నాట్స్ సంబరాల్లో ఆకర్షణలు
ఓర్లాండో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జూలైలో నిర్వహిస్తున్న తెలుగు సంబరాలకు ఫ్లోరిడా గవర్నర్ చార్లీ క్రైస్ట్ 'ఆహ్వానిత వక్త'గా హాజరవుతున్నారని సంస్థ రాసిన ఒక న్యూస్ లెటర్ లో వెల్లడించింది. ఈ సంబరాల్లో పాల్గొనే ఔత్సాహికులు వసతి సౌకర్యం కోసం హొటల్ గదులను తగ్గింపు ధరకు ముందుగా రిజర్వ్ చేసుకొనే అవకాశాన్ని ఈ నెలాఖరు వరకూ పొడిగించినట్లు ఆ న్యూస్ లెటర్ లో స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఈ సౌకర్యం జూన్ 17 వరకూ మాత్రమే కల్పించారు. నగరంలోని పీబాడీ ఓర్లాండో, రోసెన్ సెంటర్ హొటళ్ళలో గదులు రిజర్వ్ చేసుకునే వారికి ప్రత్యేక అద్దె ధర తగ్గింపు సౌకర్యం ఉంటుందని సంస్థ రాసిన న్యూస్ లెటర్ లో వెల్లడించింది. జూలై 2 నుంచి 4వ తేదీ వరకూ 'తెలుగు సంబరాలు' నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండోలో ఉన్న ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సంబరాల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయని సంస్థ వివరించింది.
'పీపుల్స్ గవర్నర్' గా ప్రసిద్ధుడైన చార్లీ క్రైస్ట్ ఫ్లోరిడా రాష్ట్రానికి 44వ గవర్నర్ గా ఎన్నికైనప్పటి నుంచీ ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజామోదాన్ని ఇనుమడింపజేశారు. ఫ్లోరిడా ఆర్థిక వ్యవస్థను బలపర్చేందుకు కృషి చేస్తున్నారు. ఫ్లోరిడాలోని పిల్లలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు విశేష ప్రాధాన్యం ఇచ్చారని నాట్స్ న్యూస్ లెటర్లో పేర్కొంది.
ఉదయభాను యాంకరింగ్ :
స్టేజి, టీవీ కార్యక్రమాల యాంకరింగ్ లో తనదైన శైలిలో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఉదయభాను తెలుగు సంబరాలకు యాంకర్ గా వ్యవహరిస్తారని నాట్స్ పేర్కొంది. తెలుగు సంబరాల్లో సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, వాయిద్య సంగీతం, జానపద గీతాలు, గజళ్ళు, ఫ్యూజన్ మ్యూజిక్ తదతర పలు ఆకర్షణీయమైన, ఆసక్తికరమైన, ఆనందదాయకమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాట్స్ న్యూస్ లెటర్ వెల్లడించింది. దీనికి తోడు పలువురు సినీ కళాకారులు, సంగీత కళాకారులు, సాహిత్యకారులు, ఆధ్యాత్మిక బోధకులు, మిమిక్రీ కళాకారుడు ఈ సంబరాల్లో తమ తమ కార్యక్రమాలతో అలరిస్తారని న్యూస్ లెటర్ పేర్కొంది.
నాట్స్ తెలుగు సంబరాల్లో పాల్గొని ఆనందం పొందాలనుకున్న వారు ఇంక ఆలశ్యం చేయకుండా sambaralu.org. లో ఆన్ లైన్ ద్వారా తమ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సంస్థ న్యూస్ లెటర్ లో స్పష్టం చేసింది.
News Posted: 19 June, 2009
|