'సాహిత్యానికి స్ఫూర్తే సొంపు'
డల్లాస్ : తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్ టెక్స్) తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 23 వ 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం స్థానిక స్వదేశీ ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ప్రముఖ కవి, రచయుత డాక్టర్ జె. బాపురెడ్డి ఈ సాహితీ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
మొదట డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి చందోబద్ధంగా రాసిన ‘వసంత కన్య’ పద్యాలను చదివి వినిపించారు. తరువాత రమణ జువ్వాది తిక్కన మహాభారత పద్యాలను రాగయుక్తంగా ఆలాపించారు. పిమ్మట అన్నవరపు రంగనాయకులు నన్నయ భట్టారకుడి ఉదంకోపాఖ్యానంలోని మహాభారత పద్యాలను పాడారు. తదుపరి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ చేసిన గీతాలాపన సభికులను ఆకట్టుకుంది. సీత ములుకుట్ల విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గురించి సభకు తెలియ చేశారు. శరత్ అకినేపల్లి ఏదో ఏదో అన్నది అనే సినీ గేయాన్ని ఆలాపించారు. ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం గురించి వర్ణిస్తూ రచించిన డల్లాసాంధ్రుల శోభ అనే గేయాన్ని ఆలాపించారు.
ముఖ్య అతిథి డాక్టర్ జె. బాపురెడ్డిని తోటకూర ప్రసాద్ సభకు పరిచయం చేశారు. మొదట బాపురెడ్డి 'ఆధునిక తెలుగు కవిత్వం – తీరుతెన్నులు' అంశంపై ప్రసంగించారు. రచనలు గేయ, పద్య, గద్య రూపాలలో ఉన్నాఅవి కవిత్వంగా రాణించడానికి, భాసించడానికి వాటిలో ఇంపు, కుదింపు, స్ఫూర్తి ఎంతైనా ఉండాలని తెలిపారు. అప్పుడే కవిత్వానికి మధురత్వం వస్తుందన్నారు బాపురెడ్డి. ప్రాచీన సాహిత్యంలో నుండి, నన్నయ మున్నగు కవుల కవిత్వ ఉదాహరణలను, ఆధునిక సాహిత్యాలలో నుంచి గురజాడ, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వ సొంపును, ప్రతిభను తెలిపారు. బాపురెడ్డి తన స్వీయకవితలతో సాహిత్య ప్రియులను ముగ్ధులను చేశారు. ముఖ్య అతిథిని ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, రాజారెడ్డి శాలువతో సత్కరించారు. శ్యామల రుమాల్ల పుష్పగుచ్ఛంతో, సాహిత్య వేదిక కార్యవర్గం సభ్యులు తోటకూర ప్రసాద్, టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి జ్ఞాపికతో సత్కరించారు.
తదుపరి తోటకూర ప్రసాద్ సభికులకు తెలుగులో రాత పరీక్ష నిర్వహించారు. ఇందులో శాంత పులిగండ్ల మొదటి బహుమతి, ఆచంట సుబ్రమణ్యం ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. సాహిత్య వేదిక చైర్ అనంత్ మల్లవరపు కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
జూలై 11న సాహిత్య వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ' సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం' రూపంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఈ వేడుకలకు ఎందరో సాహిత్య ప్రముఖులు తరలి వస్తున్నందున అందరినీ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా నిర్వాహకులు తెలియచేశారు.
News Posted: 23 June, 2009
|