తెలుగుపీపుల్ డైరెక్టరీ
న్యూజెర్సీ: అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడిన తెలుగు ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, సంస్థల వివరాలతో కూడిన ఒక డైరెక్టరీని ప్రచురించేందుకు తెలుగుపీపుల్.కామ్ నడుం బిగించింది. జూలై 2న షికాగోలో ప్రారంభమయ్యే 'తానా' మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ తోటకూర ప్రసాద్ 'తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ' బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన బ్రోచర్ తొలి కాపీని ఆయన అదే వేదికపై ప్రముఖ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కు అందచేస్తారు.
వినూత్నంగా, విలక్షణమైన రీతిలో ప్రచురించబోతున్న 'తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ' ఈ ఏడాది డిసెంబర్ లో అందుబాటులోకి వస్తుంది. అటు అమెరికా, ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ బుక్ స్టోర్స్ , వాణిజ్య కేంద్రాలలో ఈ డైరెక్టరీ అమ్మకాలకు సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవాసం వచ్చి అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, వివిధ రంగాలలో స్థిరపడిన డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, కంప్యూటర్ నిపుణులు, అటార్నీలు, ఫైనాన్షియల్ నిపుణులు, ఐటి, హెల్త్ కేర్, ఫార్మా, సైన్స్ , టెక్నాలజీ, హోటల్ మేనేజ్ మెంట్, ఎడ్యుకేషన్ వంటి పలు రంగాలలో ఎనలేని ఖ్యాతి సంపాదించిన తెలుగువారు, వారు నిర్వహించే వ్యాపార, వాణిజ్య సంస్థల వివరాలతో తెలుగుపీపుల్.కామ్ ప్రచురించబోతున్న ఈ డైరెక్టరీ అమెరికన్ తెలుగు సమాజంలోనే ఒక సరికొత్త ప్రయత్నం కాబోతున్నది.
గడచిన మూడు దశాబ్దాల కాలంలో అమెరికా ప్రవాసం వెళ్ళిన అనేక మంది తెలుగు ప్రజలు పలు రంగాలలో అసమాన ప్రతిభా సామర్ధ్యాలు కనబరిచి ప్రపంచ స్థాయి గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. ఐటి రంగంలో సంభవించిన విప్లవం అనంతరం అమెరికా వలస వెళ్ళి అక్కడ స్థిరపడిన తెలుగు వారి సంఖ్య అపారంగా పెరిగిన సంగతి విదితమే. అయితే అమెరికాలోని తెలుగు వారందరినీ పరస్పరం పరిచయం చేయడానికి అనువైన ఒక డైరెక్టరీ లేకపోవడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు తెలుగుపీపుల్.కామ్ నడుం కట్టింది.
మూడు మాసాలుగా కృషి చేసి డైరెక్టరీ రూపకల్పనకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అమెరికాలోని తెలుగువారు ఈ డైరెక్టరీలో తమ వ్యక్తిగత వివరాలు, తమ వ్యాపార, వాణిజ్య సంస్థలకు సంబంధించిన వివరాలను లిస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం నిర్ణీత లిస్టింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. డైరెక్టరీ పబ్లిష్ చేసి కాపీలను సభ్యులకు వారి చిరునామాలకు పంపించడం జరుగుతుంది. అలాగే ఈ డైరెక్టరీని తెలుగుపీపుల్.కామ్ పోర్టల్ లో సైతం అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
News Posted: 26 June, 2009
|