మధుయాష్కీకి సత్కారం
న్యూజెర్సీ : రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు మధుయాష్కీ పిలుపు ఇచ్చారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అటు గ్రామీణ ప్రాంతల రైతులకు, నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. అలా ముందుకు వచ్చే ప్రవాసాంధ్రులకు తను అన్ని విధాలా సహకారాన్ని అందచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రెండోసారి ఎంపీగా ఎన్నికైన మధుయాష్కీని ఇక్కడి తెలుగువారు ఆదివారం నాడు ఘనంగా సత్కరించారు. ఎడిసన్ లోని రాయల్ ఆల్బర్ట్ పేలస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యాష్కీ మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ బాబ్లీ ప్రాజెక్టుపై ప్రైవేట్ కేసు వేసిన తొలి వ్యక్తిని తానేనని, తెలుగు ప్రజలకు ఏ రూపంలో అన్యాయం జరిగినా తాను పోరాడచానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అలానే మహబూబ్ నగర్ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని వివరించారు.
అలానే నిధుల కొరతతో నిజామాబాద్-కరీంనగర్ రైల్వే లైన్ పనులు ఆగిపోయాయని, ఈ పనుల కోసం 150 కోట్ల రూపాయలను కేటాయించవలసిందిగా కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీని కోరినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ యువ కేంద్రం కార్యకర్తల స్టయిఫండ్ గతంలో నెలకు వెయ్యి రూపాయలుగా ఉండేదని, దానిని 2500 రూపాయలకు పెంచేటట్లు కేంద్రాన్ని ఒప్పించానని వివరించారు. ఈ సత్కార సభ న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేంద్ర చివుకుల, ప్రముఖ స్వచ్ఛంద సేవా కార్యకర్త డాక్టర్ తులసీ రాఘవరావు పోలవరపు, జానకీరావు, మోహన్ పటోళ్ళ, ఎస్ఎస్ రెడ్డి, రమేష్ చంద్ర, రవి దన్నపునేని, ప్రదీప్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
News Posted: 30 June, 2009
|