న్యూజెర్సీలో 2011 నాట్స్
న్యూజెర్సీ : ఉత్తర అమెరికా తెలుగు సంబరాలు (నాట్స్) ద్వితీయ ద్వైవార్షిక సమావేశాలు 2011లో న్యూజెర్సీ\ ఫిలడెల్ఫియాలో జరగనున్నాయి. నాట్స్ సంస్థ కార్యానిర్వాహకవర్గం జూన్ 29న ఇక్కడ సమావేశమై ఈ మేరకు నిర్ణయించింది. అమెరికా ఇండిపెండెన్స్ డే వారాంతపు రోజులైన 2011 జూలై 1-3 తేదీల మధ్య నాట్స్ ద్వితీయ ద్వైవార్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంబరాలకు అనువైన వేదిక కోసం న్యూజెర్సీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నాట్స్ సభ్యులు ఇప్పటి నుంచే అన్వేషణ ప్రారంభించారు. నాట్స్ అధ్యక్షుడు రాణాకుమార్ నాదెళ్ళ, నాట్స్ బోర్డు డైరెక్టర్లు డాక్టర్ మధు కొర్రపాటి, రవి మాదల ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు.
తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో దినదిన ప్రవర్ధమానమవుతున్నదని నాట్స్ అధ్యక్ష, బోర్డు డైరెక్టర్లు పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తెలుగువారి హాజరు అత్యధిక సంఖ్యలో ఉంటోందన్నారు. తెలుగువారి ప్రత్యేకతను చాటే అద్భుతమైన కార్యక్రమం 'అమెరికా తెలుగు సంబరాలు'కు వెనువెంటనే స్పందన లభించే న్యూజెర్సీలో నిర్వహించడం ఉత్తమం అని తాము నిర్ణయించినట్లు వివరించారు.
కాగా, 2009 జూలై 2 గురువారం నుంచి జరగనున్న నాట్స్ తెలుగు సంబరాల ఏర్పాట్లపై నాట్స్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు అనేక వేల మంది ఉత్సాహంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని వారు వెల్లడించారు. ఉత్తర అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంబరాల వేదిక ఓర్లాండోకు ఉత్సాహంగా చేరుకుంటున్నారని నాట్స్ బృందం తెలిపింది. తాము నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడం చెప్పలేనంత ఆనందంగా ఉందని నాట్స్ కార్యనిర్వాహకవర్గం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.
News Posted: 1 July, 2009
|