తెలుగు పండుగకు అంతా రెడీ
షికాగో : జూలై 2, 3 తేదీల్లో షికాగోలో నిర్వహిస్తున్న 'తెలుగు ఫెస్టివల్'కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని షికాగో తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రావు ఆచంట తెలిపారు. సమాజ సేవే పరమావధిగా షికాగో తెలుగు అసోసియేషన్ ఆవిర్భవించిందని ఆయన వివరించారు. ప్రసిద్ధ సినీ నేపథ్య సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ఆయన సంగీత బృందం, తెలుగు సినీ హాస్య నటుడు అలీ, హేమ సహా అతిథులందరూ షికాగో నగరానికి చేరుకున్నారు. షికాగో తెలుగు అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి వెళ్ళి అతిథులందరికీ సాదర స్వాగతం పలికారు.
మెలోడీ కింగ్ కీరవాణి తెలుగు ఫెస్టివల్ జరిగే వేదికను సందర్శించి తమ సంగీత విభావరి కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఓడియమ్ ఎక్స్ పో సెంటర్ లో తెలుగు ఫెస్టివల్ జరుగుతోంది. టాలీవుడ్ హీరోయిన్లు మమతా మోహన్ దాస్, నిఖిత, సంజన, కొరియోగ్రాఫర్ రాంజీ, అమృత బృందం తమ కార్యక్రమానికి సంబంధించిన రిహార్సల్స్ ను అవిశ్రాంతంగా చేస్తున్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కళాకారులతో కలిసి అలీ, హేమ అతిథులను కడుపుబ్బ నవ్వించి, ఆనంద సాగరంలో ముంచెత్తేందుకు సంసిద్ధమవుతున్నారు. జూలై 2, 3 తేదీల్లో బ్రహ్మాండంగా జరగనున్న షికాగో తెలుగు ఫెస్టివల్ లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యే తెలుగు కుటుంబాల కోసం నిర్వాహకులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. షికాగోలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ ను చిరకాలం గుర్తుండిపోయేలా నిర్వహించాలని నిర్వాహకులు చక్కని ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రావు ఆచంట పేర్కొన్నారు.
News Posted: 2 July, 2009
|