తానా వేడుకలు ప్రారంభం
షికాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ద్వైవార్షిక మహా సభలు ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జూలై 2 గురువారం సాయంత్రం అతిథుల కోసం ఏర్పాటు చేసిన బాంకెట్ డిన్నర్ తో ఈ వేడుకలు మొదలయ్యాయి. స్థానిక రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ ఉత్సవాలు మొత్తం మూడు రోజుల పాటు ఏకబిగిన నిర్వహిస్తారు. తానా వేడుకల్లో భాగంగా పలు సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార, వాణిజ్య ప్రదర్శనలు, తానా - మా టీవీ 'సూపర్ సింగర్' పోటీలు, తెలుగువారి సంస్కృతి ఉట్టిపడేలా షడ్రశోపేతమైన విందు భోజనాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు ప్రభాకర చౌదరి కాకరాల మీడియాకు వెల్లడించారు.
ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి, అమెరికా వ్యాప్తంగా స్థిరపడిన పలువురు తెలుగు ప్రముఖులు ఇప్పటికే షికాగో నగరానికి తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. తెలుగు ప్రముఖుల రాక, సంబరాల సందడితో షికాగో నగరం కళకళలాడుతున్నది. వేడుకల ప్రారంభ గీతాన్ని ప్రసిద్ధ సినీ పాటల రచయిత, కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారని, ఆ గేయాన్ని అనేక మంది కళాకారులు సుమారు 40 నిమిషాల పాటు వేదిక మీద ప్రదర్శిస్తారని ప్రభాకర చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు గల్లా అరుణకుమారి, మోపిదేవి వెంకటరమణ తదితర అతిథులు ఎందరో ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారన్నారు. తానా వేడుకల వినోద కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించనున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం రాలేదని, దీనితో ఆయన సంగీత విభావరి జరగకపోవచ్చని ఆయన చెప్పారు. అయితే, ఈ సభల సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి 'లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు'ను అందజేస్తున్నామన్నారు. అతిథులందరూ నగరానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం భోజనానంతరం బిజినెస్ సెమినార్ తో ప్రారంభమై పలు సెమినార్లు నిర్వహిస్తున్నట్లు ప్రభాకర చౌదరి వెల్లడించారు. సాయంత్రం ప్రసిద్ధ నటుడు, నిర్మాత మురళీమోహన్ బృందం, రవితేజ తదితర కళాకారులలో వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఇలా ఉండగా, ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యం తానా సభలపైనా పడింది. మాంద్యం కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నందున ప్రవేశరుసుమును సంస్థ తగ్గించింది. రాను పోను విమాన చార్జీలను బేరీజు వేసుకుని ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగువారు ఈ సమావేశాలకు సొంత కార్లలోనే బయలుదేరి వచ్చారు. తెలుగు విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కూడా సంస్థ వేర్వేరుగా ప్రవేశ రుసుములను తగ్గిస్తూ ఆఫర్ ప్రకటించింది. దీనితో చివరి నిమిషంలో తానా ప్రవేశానికి తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ఔత్సాహికుల నుంచి పెద్ద ఎత్తు స్పందన వచ్చింది.
News Posted: 3 July, 2009
|