తానా మహాసభలు ప్రారంభం
షికాగో: 17వ ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మహాసభలు శుక్రవారం ఇక్కడ ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తానా అధ్యక్షులు ప్రభాకర చౌదరి కాకరాల అధ్యక్ష్యోపన్యా చేస్తూ, ఆంధ్రప్రదేశ్ లో తానా చేపడుతున్న వివిధ విద్యా, ఆరోగ్య, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం తానా చేస్తున్న కృషిని మరింతగా ముమ్మరం చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రారంభ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నఆర్ బిఐ మాజీ గవర్నర్ వైవి రెడ్డి, ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతరామశాస్ర్తి, హైకోర్టు న్యాయమూర్తి టీ. గోపాల కృష్ణలు మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘తానా తెలుగు తేజం రోల్ మోడల్ అవార్డు’’ ను ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడుకు తానా అధ్యక్షుడు కాకరాల ప్రభాకర్ చౌదరి అందజేశారు.
అనంతరం తెలుగు జాతిని ఇనుమడింపచేసిన ప్రముఖ వ్యక్తులు, వారి జీవిత చరిత్రలను వివరించే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను, చరిత్రను ప్రతిబింబించే విధంగా నృత్య, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఇక్కడి తెలుగువాళ్లందరూ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇంకా ఈ తానా ఉత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
News Posted: 3 July, 2009
|