హుషారుగా నాట్స్ వేడుకలు
ఫ్లోరిడా : ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సంస్థ ఆవిర్భావ దినోత్సవాలు ఆహ్లాదకర వాతారణంలో ఆహూతులను హుషారెక్కిస్తూ కొనసాగుతున్నాయి. ఓర్లాండోలోని ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ జరుగుతున్న ఈ వేడుకల తొలిరోజు (గురువారం రాత్రి - భారత కాలమానం ప్రకారం)న నిర్వహించిన ప్రారంభం వేడుకల్లో భారీ సంఖ్యలో తెలుగు వారు తమ తమ కుటుంబ సభ్యులతో సహా ఆనందంగా పాల్గొన్నారు. వేడుకల ప్రారంభోత్సవానికి ఫ్లోరిడా గవర్నర్ చార్లీ క్రిస్ట్ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. సినీ నటుడు తారకరత్న, తనికెళ్ళ భరణి తదితరులు తొలిరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా గురువారం సాయంత్రం 8 నుంచి 9.30 గంటల మధ్య బాంక్వెట్ (విందు)తో నాట్స్ సంబరాలకు అంకురార్పణ జరిగింది.
నాట్స్ వేడుకల్లో భాగంగా డాన్స్, డ్రామా, హాస్య నాటికలు, ప్రముఖ నటుడు సాయికుమార్ కర్ణుడిగా పౌరాణిక నాటకం, ప్రసిద్ధ సినిమా రచయిత, నటుడు తనికెళ్ళ భరణి 'శివతత్వాలు', అనేక మంది సినీ రంగ కళాకారులు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ జానపద గేయాలు, గజల్ విద్వాంసుడు గజల్ శ్రీనివాస్, నటీమణులు మమతా మోహన్ దాస్, పార్వతీ మెల్టన్, కాజల్, సంజన, శియ, నిఖిత, హేమ, జయలలిత, సన, ఉదయభాను తదితరుల తళుకుబెళుకులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి.
నాట్స్ సంబరాల్లో రెండో రోజు శుక్రవారంనాడు ప్రముఖ జాజ్ వాయిద్యకారుడు శివమణి తన ప్రదర్శనతో ఆహూతులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నారు. అనేక రకాల వాయిద్యాలను ఏకకాలంలో వాయిస్తూ శివమణి చేసే విన్యాసాలు అతిథులను కచ్చితంగా ఆనందపరుస్తాయనడంలో సందేహం లేదు.
News Posted: 4 July, 2009
|