`డైరెక్టరీ ఆలోచన భేష్'
షికాగో : అమెరికాలో ఉంటున్న ఆంధ్రులు, ఇతర ప్రముఖుల వివరాలతో డైరెక్టరీని ప్రచురించడం మంచి కార్యక్రమమని, ఒకరి సమాచారం మరోకరు తెలుసుకోడానికి, ఒకరికొకరు సహాయ, సహకారాలు అందుకోడానికి దోహదం చేస్తుందని ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్ జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ డైరెక్టరీ ప్రచురణను చేపట్టిన `తెలుగు పీపుల్'ను ఆయన అభినందించారు. తానా సభలలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జితేందర్ రెడ్డి `తెలుగు పీపుల్' తో మాట్లాడారు. అమెరికాలో తెలుగువారి శ్రేయస్సు కోసం తానా చేస్తున్న కృషి తిరుగులేనిదని, తెలుగు సంఘాలలో పటిష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. తానా స్థానం సుస్థరమైనదని, తాను గత మూడేళ్ళుగా తానా సభలకు హజరవుతున్నానని, అమెరికా తెలుగువారి ఆదరణ ఎంతమాత్రం తగ్గలేదని ఆయన వివరించారు.
కాగా, కొత్తగా తెలుగు సంఘాలు ఏర్పడటం మంచి పరిణామం కాదని, ఇది అనైక్యతను సూచించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. సంఘంలో వచ్చే అభిప్రాయబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. కోర్టు కేసులు వేసుకోవడం, కీలక ప్రముఖులు ఎడమొహం పెడ మొహంగా వ్యవహరించడం ప్రతిష్టను దిగజార్చుతుందని ఆయన అన్నారు. సంఘం అన్న తరువాత సమస్యలు ఉంచాయని, వాటిని పంతాలకు పోయి పెద్దవి చేసుకోకూడదని ఆయన చెప్పారు. ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్న పెద్దల మాటను గుర్తుచేసుకుంటే మంచిదని ఆయన అన్నారు. ఒకేసారి రెండు మూడు చోట్ల సమావేశాలు జరగడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
News Posted: 4 July, 2009
|