వర్జీనియా బీచ్ లో విషాదం
వర్జీనియా: నార్త్ వర్జీనియాలో నివసిస్తున్న ఒక తెలుగింటి ఆడపడచు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మరణించింది. నార్త్ వర్జీనియాలోని యాష్ బర్న్ ప్రాంతానికి చెందిన ఉమేష్ తన భార్య సుజన, ఆరేళ్ళ కుమారుడుతోపాటు మరో రెండు తెలుగు కుటుంబాలతో కలసి వీకెండ్ హాలీడే సందర్భంగా శుక్రవారం వర్జీనియా బీచ్ కు విహారానికి వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో వీరంతా సముద్రంలో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా సముద్రంలో అలల ఉధృతి పెరిగిపోయింది. రిప్ కరెంట్ గా పరిగణించే ఒక ఉధృతమైన కెరటం సుజనను చుట్టేసి సముద్రంలోకి లాక్కుపోయింది. ఆమెను రక్షించేందుకు లైఫ్ గార్డ్స్, బీచ్ లో సేదతీరుతున్న ఇతరులు వెంటనే నీటిలోకి దూకారు. అయితే రిప్ కరెంట్స్ ఉధృతి కారణంగా వారు ఆమెను చేరుకోలేకపోయారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే సుజన మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీంతో భర్త ఉమేష్, ఆరేళ్ళ కుమారుడు శోకసముద్రంలో మునిగిపోయారు.
అకాల మృత్యువాత పడిన 33 ఏళ్ళ సుజన ఇక్కడి తెలుగు సంఘాలు నిర్వహించే సామాజిక కార్యక్రమాలలో అత్యంత చురుగ్గా పాల్గొంటుండేవారు. సామాజిక సేవలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా సుజన అమెరికా ఆంధ్రులెందరికో సుపరిచితులు. ఎన్నారై వాసవి అసోసియేషన్ లో సుజన కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తుండేవారు. సుజన కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెలుగమ్మాయి. సుజన శ్రీ షిరిడీ సాయిబాబా భక్తురాలు. సాయిబాబా కార్యక్రమాల్లో ఆమె ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో సుజన చురుకైన పాత్ర పోషించేవారు. శ్రీ శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి బోధనలకు ప్రభావితమై ఆయన అనుయాయిగా మారారు. వాసవీ మాత ప్రవచించిన 'సత్యం - శీలం - అహింస' సూత్రాల పట్ల సుజనకు బలీయమైన విశ్వాసం పెంచుకున్నారు.
శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత సుజన మృతదేహం సముద్రం ఒడ్డుకు చేరుకుంది. ఆమె మృతదేహాన్ని భారతదేశానికి పంపించేందుకు ఇక్కడి కేపిటల్ ఏరియా తెలుగు సంఘం (కాట్స్) నడుం బిగించింది.
News Posted: 6 July, 2009
|