తానా కొత్త టీంకు బాధ్యతలు
షికాగో : మూడు రోజుల పాటు వైభవంగా ద్వైవార్షిక మహా సభలు నిర్వహించిన తానా కార్యవర్గం కొత్త జట్టకు పదవీ బాధ్యతలు అప్పగించింది. జూలై 4వ తేదీ తానా మహాసభల చివరిరోజున తానా సంస్థకు ఎన్నికైన కోమటి జయరాం సారథ్యంలోని కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించింది. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టింది. ఈ కొత్త కమిటీ రెండేళ్ల పాటు తానా సంస్థ తరఫున సేవలు అందిస్తుంది. జయరాం కోమటితో పాటు తానా కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రసాద్ తోటకూర, నన్నపనేని మోహన్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తానా సంస్థ కార్యవర్గ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు వారందరినీ ఒకే గొడుగు (సంఘం) కిందకు తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. తానా వివధ రంగాల్లో అందిస్తున్న సేవలను మరింతగా, మరిన్ని విభాగాలకు విస్తరిస్తామని జయరాం కోమటి పేర్కొన్నారు. ప్రవాసాంధ్రుల పురిటిగడ్డ అయిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా తానా సేవలను మరింతగా పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు.
News Posted: 7 July, 2009
|