న్యూజెర్సీలో వైఎస్ బర్త్ డే
న్యూజెర్సీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 60వ పుట్టిన రోజు వేడుకలను భారత జాతీయ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ (ఎపిఐఎన్ఓసి) విభాగం ఘనంగా నిర్వహించింది. జూలై 9న ఇక్కడి న్యూజెర్సీ సెంటర్ లో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - తుడా చైర్మన్ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జన్మదినోత్సవం సందర్భంగా తయారు చేసిన పెద్ద కేక్ ను భాస్కర్ రెడ్డి కట్ చేశారు. ఆహూతులందరికీ వైఎస్ బర్త్ డే కేక్ ను అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ కు భగవంతుని ఆశీస్సులు అందాలని ఎపిఐఎన్ఓసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఆనందదాయకంగా, ఆయురారోగ్యాలతో మరెన్నో ఇలాంటి పుట్టిన రోజులు నిర్వహించుకోవాలంటూ ముఖ్య అతిథి భాస్కర్ రెడ్డి, ఎపిఐఎన్ఓసి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పెన్షన్, వృద్ధాశ్రమాలు లాంటి సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.
వైఎస్ పుట్టినరోజు వేడుకల్లో ఎపిఐఎన్ఓసి సభ్యులతో పాటు అధిక సంఖ్యలో వైఎస్ అభిమానులు, మద్దతుదారులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సురేష్ రెడ్డి సడిపిరాళ్ళ, జగదీష్ మల్ రెడ్డి, క్రితిక్ మల్ రెడ్డి, నాగభూషణరెడ్డి గీధర, సింధూర గీధర, యశ్వంత్ రెడ్డి పులికుంట్ల, రవిరెడ్డి, వంశీ కొత్తపు, ధరణీధర్ రెడ్డి మల్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు. వైఎస్ జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. పలు ఆస్పత్రుల్లోని రోగులకు వైఎస్ మద్దతుదారులు పండ్లు పంపిణీ చేశారు.
News Posted: 10 July, 2009
|