జయరాం పదవీ స్వీకారం
షికాగో : ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) నూతన అధ్యక్షునిగా జయరాం కోమటి పదవీ స్వీకారం చేశారు. షికాగోలో జరిగిన తానా 17వ మహాసభల సందర్భంగా జూలై 4వ తేదీన సుమారు 8 వేల మంది ప్రవాసాంధ్ర అతిథుల హర్షాతిరేకాల మధ్య ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. కాలిఫోర్నియాలో రెస్టారెంట్ వ్యాపారం నిర్వహిస్తున్న జయరాం కోమటి ప్రవాసాంధ్ర ప్రముఖుడిగా ఎదిగారు. ఇక్కడి రోజ్ మాంట్ కన్వెన్షన్ సెంటర్ లో 32 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల తానా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జయరాం కోమటి తన కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షునిగా ప్రసాద్ తోటకూర, కార్యదర్శిగా మోహన్ నన్నపనేని, కోశాధికారిగా రామ్ యలమంచిలి, సంయుక్త కార్యదర్శిగా వీరు వుప్పల, తానాకు చెందిన వివిధ ప్రాంతీయ ఉపాధ్యక్షులు కూడా ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తానా అధ్యక్షునిగా ఎన్నికవడంలో తనకు మద్దతు ఇచ్చిన ప్రవాసాంధ్రులకు ముందుగా జయరాం కోమటి ధన్యవాదాలు తెలిపారు. తానా గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. తానా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోనిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. తన కార్యవర్గ సభ్యుల మద్దతుతో తానాను మరింత బలీయమైన సంస్థగా రూపొందిస్తానని తెలిపారు.
తానా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జయరాం కోమటి తన ప్రాధమ్యాలను వివరించారు. ప్రవాసాంధ్రులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చి తానాను బలీయంగా చేయడం తన తొలి ప్రాధాన్యత అని జయరాం పేర్కొన్నారు. తానాకు సంబంధించిన వార్తలు ప్రచురించేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు మీడియా కూడా న్యాయబద్ధంగా, నిజాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రెండో ప్రాధమ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తానా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మరింత పెంచుతానని ఆయన చెప్పారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, గ్రామాలను దత్తత తీసుకోవడం, హైదరాబాద్ లో తానాకు ఓ శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాన్ననారు.
గత 15 సంవత్సరాలుగా జయరాం కోమటి తానాలో వివిధ హోదాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 203వ సంవత్సరంలో జరిగిన 13వ తానా మహాసభలకు ఆయన కన్వీనర్ గా అందించిన సేవలు ప్రశంసలు పొందాయి. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలంటే జయరాం కోమటికి ప్రగాఢ విశ్వాసం. తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమాల్లో జయరాం చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
News Posted: 11 July, 2009
|