'ఇండియానా'లో క్రికెట్ టోర్నీ
ఇండియానా పోలిస్ : ఇండీ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఇండియానాపోలిస్ లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఇండియానాపోలిస్ పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన 9 జట్లు గత నెల రోజులుగా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియానాపోలిస్ కు చెందిన ఇన్విన్సిబుల్స్ జట్టు, బ్లూమింగ్టన్ కు చెందిన బ్లూమింగ్టన్ క్రికెట్ బోర్డు జట్టు తలపడగా.. ఇన్విన్సిబుల్స్ జట్టు విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియానాపోలిస్ ఉద్యానవన శాఖ డైరక్టర్ స్టూవర్ట్ లౌరీ, ఆర్.సీ.సీ కన్సల్టింగ్ కంపెనీ సీఈఓ రాబర్ట్ రీడ్ హాజరయ్యారు.
క్రికెట్ పోటీల ముగింపు సభలో స్టూవర్ట్ లౌరీ ప్రసంగిస్తూ, క్రికెట్ ఆటను ప్రోత్సహించటానికి ఇండియానాపోలిస్ లో ప్రభుత్వం తరఫున ఒక స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. రాబర్ట్ రీడ్ మాట్లాడుతూ, భారతీయులు అన్నిరకాల క్రీడల్లో రాణిస్తున్నారని, మిగతా వారు కూడా ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహిస్తే తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. ఇన్విన్సిబుల్స్ జట్టు కెప్టెన్ సందీప్, మౌర్య, హరి, వెంకట్, ప్రతీక్, పృథ్వీ, సంతోష్ లకు స్టూవర్ట్ లౌరీ బహుమతి ప్రదానం చేశారు.
ఈ పోటీలను ఇండీ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు బాలకృష్ణమూర్తి, గోపాల్ తదితరులు పర్యవేక్షించారు.
News Posted: 20 July, 2009
|