ఆరోగ్యశ్రీకి ఎన్నారై విరాళం
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఆరోగ్యశ్రీ పధకానికి ఆకర్షితులై అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడిన తెలుగు ప్రముఖలు, ప్రసిద్ధ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విలువైన 50 వేల అమెరికా డాలర్లను విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని కలుసుకుని చెక్కును అందజేశారు. చిత్తూరు జిల్లా అరగొండ అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయం ఛైర్మన్ సుగుణాకర్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ విరాళాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి వినియోగించుకోవాలని దాత కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రేమ్ సాగర్ రెడ్డి దాతృత్వాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఏ ఒక్క పేదవాడు తనకు గుండెజబ్బు, క్యాన్సర్ వంటి భయానక జబ్బులు వచ్చినపుడు నిబ్బరం కోల్పోంకుండా ఉండేలా, ధనికుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఉచితంగా చికిత్సలు చేసుకొనడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు జరుపుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
News Posted: 22 July, 2009
|