వైఎస్ కు టికెఎస్ ఆహ్వానం
హైదరాబాద్ : బహ్రెయిన్ లో సందర్శించాలని అక్కడ నివసిస్తున్న తెలుగువారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆహ్వానించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఉన్నత విద్య, ప్రవాసాంధ్రుల వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును కూడా వారు ఆహ్వానించారు. బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు కళా సమితికి చెందిన ప్రతినిధుల బృందం జూలై 23 గురువారంనాడు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రి శ్రీధర్ బాబును కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు బహ్రెయిన్ లో నివాసం ఉన్న తెలుగువారు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి చర్చించారు.
బతుకుదెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి బహ్రెయిన్ వెళ్ళిన తెలుగువారు పడుతున్న ఇబ్బందుల గురించి, వారి సమస్యల పరిష్కారం కోసం బహ్రెయిన్ తెలుగు కళా సమితి సంస్థ నిర్వహిస్తున్న సాంఘిక సేవా కార్యక్రమాల గురించి వివరిస్తూ ఒక మెమొరాండంను ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి బహ్రెయిన్ సందర్శించి ప్రవాసాంధ్రుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆ మెమొరాండంలో తెలుగు కళా సమితి ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది.
News Posted: 25 July, 2009
|