కెనడాలో తొలి కధల సంపుటి
టొరంటో : 'పడమటి కనుమల్లో తరుణోదయం' అనే తెలుగు కథా సంపుటిని జూలై 25న సుప్రసిద్ధ హాస్య రచయిత, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు ఆవిష్కరించారు. కెనడాలో ఆవిష్కృతమైన తొలి తెలుగు కథా సంపుటి ఇదే. ఈ సంపుటంలో మంగళా కందూర్, కొమరవోలు సరోజ, సోమయాజుల సోదరులు, శేషు అప్పారావు, నెల్లుట్ల నవీనచంద్ర కథలను ముద్రించారు. టొరంటో నగరంలోని ఆల్బెర్ట్ కాంప్ బెల్ లైబ్రరీ ఆడిటోరియంలో ఈ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఆరు నెలలుగా టొరంటోలో నెల నెలా తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ 'తెలుగు వాహిని' ఆధ్వర్యంలో ఈ సంపుటి ఆవిష్కరణ సభ విజయవంతంగా జరిగింది. సభకు వంద మందికి పైగా సాహిత్యాభిమానులు హాజరయ్యారు.
ముందుగా చిరంజీవులు పోతంశెట్టి మోనిక, హారిక అతిథులను ఆహ్వానించారు. కొమరగిరి మురళి ఈ సమావేశాన్ని నిర్వహించారు. దగ్గుపాటి రామమర్తి ఆలపించిన గణేశ, కొమరగిరి మధు గానం చేసిన సరస్వతి ప్ర్రార్థనలతో సభ ప్రారంభమైంది. శ్రీమతి గొల్లపూడి పద్మ, పోతంశెట్టి సత్యం, శ్రీమతి కరవడి మధుబాల, శ్రీమతి కల్లూరి కమల ఈ కథా సంపుటిలోని కథలను సమీక్షించారు.
చిట్టెన్ రాజు తన సహజసిద్ధమైన హాస్య ధోరణిలో ఆహూతులను నవ్విస్తూనే సభను ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెన్ రాజు ఉత్తర అమెరికా దేశపు తెలుగు కథల గురించి వివరించారు. తమ ఇటీవలి ప్రచురణ '20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంథం' గురించి పరిచయం చేశారు. చిరంజీవి పిల్లారి శెట్టి, అశ్విన్ ధన్యవాదాలు సమర్పించారు. సభానంతరం ఆహూతులందరికీ అల్పాహారం, తేనీటి విందును నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
కెనడా దేశపు తెలుగువారి చరిత్రలో మొట్టమొదటి తెలుగు కథా సంకలనం ఆవిష్కరణ పట్ల ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కథకులు నెల్లుట్ల నవీన చంద్ర, మంగళా కందూర్, కొమరవోలు సరోజ, వంగూరి చిట్టెన్ రాజు, శేషు అప్పారావు, సోమయాజులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News Posted: 30 July, 2009
|